West Bengal : ఎల్పీజీ కొరత దేశమంతా ఉన్న సంగతి తెలిసిందే. ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంపై కూడా పడింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎల్పీజీ కొరత కారణంగా విద్యార్థులకు అన్నం బదులు పానీపూరీ (గోల్గప్పా)లు వడ్డించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.
కమర్షియల్ సిలిండర్లపై విద్యార్థులకు స్థానికంగా పాఠశాలల్లోనే వంట చేసి వడ్డిస్తుంటారు. అయితే, ఇటీవల ఇరాన్ సంక్షోభం కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని భద్రకాళి పాఠశాలలో కూడా ఎల్పీజీ కొరత కారణంగా రెగ్యులర్ మధ్యాహ్న భోజనం అందించడం వీలు కాలేదు. దీంతో విద్యార్థులకు పానీపూరీలు అందించారు. దీనికి ఎక్కువ గ్యాస్ అవసరం ఉండదనే సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విడుదలైన వీడియోలో పిల్లలు వరుసగా నిలబడి తమ ప్లేట్లలో పానీపూరీలు తీసుకెళ్లారు. అక్కడి ఒక అసిస్టెంట్ టీచర్ దీన్ని వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. దీనిపై ఆన్లైన్లో విస్తృత చర్చ జరుగుతోంది.
పిల్లలకు ఆహారం ఇవ్వలేని సందర్భంలో గోల్గప్పాలు ఏర్పాటు చేసి మంచి పని చేశారని, పానీపూరీలు తింటుంటే పిల్లల మొహంలో ఆనందం కనిపిస్తుందని కొందరు అంటుంటే.. ఎన్ని పానీపూరీలు తిన్నా రెగ్యులర్ మీల్ తిన్నట్లుగా ఆకలి తీరదని, పోషకాలు అందవని కొందరు అంటున్నారు. ఏదేమైనా దేశంలో ఎల్పీజీ కొరత సాధారణ జీవనంపై ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది.