మేడ్చల్, డిసెంబరు 29 : పోక్సో కేసులో(POCSO) 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అమాయకురాలైన బాలికను మాయమాటలతో లోబర్చుకొని, లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 జూన్లో ఈ కేసు నమోదు కాగా, అదే ఏడాది అక్టోబరులో పోలీసులు దర్యాప్తు జరిపి చార్జీషీటు దాఖలు చేశారు. సోమవారం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిగిన తుది విచారణలో అభియోగం రుజువు అయింది. వివరాల్లోకి వెళితే..మేడ్చల్ పారిశ్రామిక వాడలో నివాసం ఉండే బాలిక(15) 2022లో అదృశ్యమైనట్టు జూన్ 20, 2022న మేడ్చల్ పోలీస్స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో అదే ప్రాంతంలో నివాసం ఉండే ఒడిషాకు చెందిన బికాస్ నాయక్(40) తన రాష్ట్రానికి తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఈ దర్యాప్తులో అతడు బాలికకు మాయమాటలు చెప్పి, లైంగిక దాడికి పాల్పడినట్టు తేలింది. దీంతో అప్పటి సీఐ రాజశేఖర్ రెడ్డి పోక్సో కింద కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు అనంతరం అదే ఏడాది అక్టోబరులో కోర్టు చార్జీషీటు దాఖలు చేశారు. అప్పటి నుంచి మేడ్చల్ కోర్టులో విచారణ కొనసాగుతుంది. సోమవారం జరిగిన తుది విచారణలో అభియోగం రుజువు కావడంతో స్పెషల్ ఫాస్ట్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్ నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధించారు. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. ఈ కేసులో ఏపీపీ విజయ్ రెడ్డి కేసు వాదించి, నిందితుడికి శిక్ష పడేలా చేశారు.