కేపీహెచ్‌బీ కాలనీ : (Huzurabad) హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల నేతలు సంబురాలు చేసుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. జేఎన్టీయూహెచ్ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, టీటీఎస్డబ్ల్యూఏ, బీబీఎస్ విద్యార్థి సంఘాల నేతలు భారీ ర్యాలీగా జేఎన్టీయూహెచ్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన గెలుపు కోసం విద్యార్థి సంఘాలన్నీ పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఎర్రవల్లి జగన్, బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షుడు భానుప్రకాశ్, ఈటీఎస్డబ్ల్యూఏ అధ్యక్షుడు రంజిత్, ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్, ఎంఎస్ఎఫ్ యూనివర్సిటీ ఇన్చార్జి బల్గేరు సందీప్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం నేతలు విజయేందర్, వినోద్ నాయక్, రాజ్‌కుమార్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో…
విద్యార్థి సంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ జేఎన్టీయూహెచ్ వర్సిటీ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడికి సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు ఓడపల్లి మధు, రవి నాయక్, సాయి, శివ, రేవంత్, వర్షిత్, రుత్విక్, జ్యోతి, అశోక్, అరుణ, స్వప్న, రామకృష్ణ తదితరులు ఉన్నారు.