హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : మార్చిలోనే మండుతున్న ఎండలు.. క్షణక్షణానికి విద్యుత్తు వినియోగం పెరుగడంతో కంగారుపడ్డ విద్యుత్తు సంస్థల అధికారులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో కురిసిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో టెన్షన్ నుంచి కాస్త తేరుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, విద్యుత్తు వినియోగం, గరిష్ఠ డిమాండ్ తగ్గడంతో ఊరట చెందారు. రాష్ట్రంలోనే గరిష్ఠంగా 18,228 మెగావాట్ల డిమాండ్ ఈ నెలలోనే రికార్డయ్యింది. ఈ క్రమంలో 19 వేల మెగావాట్లు దాటుతుందని అధికారులు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిసరాలతోపాటు ఆదిలాబాద్, నిర్మల్, యాదాద్రిభువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో సోమవారం గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 17,224 మెగావాట్లు ఉండగా, మంగళవారం 16,672 మెగావాట్లకు తగ్గింది. ఈ నెల 13న విద్యుత్తు వినియోగం 341 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, సోమవారం 324 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. మంగళవారం 300 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగమైనట్టు ఇంజినీర్లు వెల్లడించారు.