హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువత కోసం విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని, అది ఉత్త క్యాలెండరేనని ఆయన ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా దాసోజు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరమని, వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఊసెత్తడం లేదని మండిపడ్డారు.
ఇప్పటివరకు ఎంతమంది అమరులను గుర్తించారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రెండేండ్లు దాటినా ఇచ్చిన హామీ అమలుచేయడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తొలగించాలని దాసోజు నిప్పులు చెరిగారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తొలి సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తే.. కాంగ్రెస్ వాళ్లు తయారుచేసిన విగ్రహాన్ని ప్రజల మీద రుద్దడమే గాక రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పోటీగా రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టారని దుయ్యబట్టారు. రైతు డిక్లరేషన్‌లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అశోక్‌నగర్‌కు రాహుల్‌గాంధీ వచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా, వారిపైనే లాఠీదెబ్బలు పడుతున్నాయని దుయ్యబట్టారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాత్రం ఐదేండ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మాట మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 67,763 ఉద్యోగాలిచ్చామని తప్పుడు లెక్కలు చెబుతున్నారని, గత ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా పూర్తి చేసిన ఉద్యోగాలనే తన ఖాతాలో వేసుకున్నదని ధ్వజమెత్తారు.
పేదల ఇండ్లు కూల్చి.. పెద్దలవి కాపాడుతున్నరు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన కోసం ప్రణాళికలు రూపొందించిందని దాసోజు గుర్తుచేశారు. కానీ గాంధీ విగ్రహం పేరుతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద అత్యంత అద్భుతంగా రాజ్యాంగ నిర్మాణ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే, ఇప్పటివరకు దాని గేట్లు ఓపెన్ చేయకుండా, తాళాలు వేశారని ఆగ్రహించారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్న రేవంత్ సర్కార్.. పెద్దల ఆస్తులను మాత్రం కాపాడుతున్నదని మండిపడ్డారు.
దాసోజు ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి పొన్నం
గవర్నర్ ప్రసంగం తప్పులతడకగా ఉన్నదని ఎమ్మెల్సీ దాసోజు శాసనమండలిలో మాట్లాడుతున్న క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అడుగడుగునా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు కూడా దాసోజు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాసోజు గట్టిగా వారించారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కల్పించుకొని సభను నియంత్రణలోకి తీసుకొచ్చారు.