Korean Kanakaraju | మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వీకెండ్లోనే సుమారు రూ. 37 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక వీకెండ్ ముగిసిన తర్వాత వచ్చిన మొదటి వర్కింగ్ డే అయిన సోమవారం కూడా ఈ సినిమా తన జోరును ఏమాత్రం తగ్గించలేదు. కఠినమైన ‘మండే టెస్ట్’ను ఈ చిత్రం చాలా విజయవంతంగా పాస్ అయింది.
విడుదలైన నాలుగో రోజు అయిన సోమవారం ఒక్కరోజే బుక్‌మైషో (BookMyShow) మరియు డిస్ట్రిక్ట్ (District) ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 70 వేలకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. దీనివల్ల మొదటి వారపు రోజుల్లోనూ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని స్పష్టమవుతోంది. ఇలాగే కలెక్షన్స్ కొనసాగితే రాబోయే రోజుల్లోనూ థియేటర్లలో ఈ చిత్రం హవా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే, ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యువి క్రియేషన్స్ (UV Creations) మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ (First Frame Entertainments) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.