హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోగా, మారిన వాతావరణం వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయని వెల్లడించింది. ఈ క్రమంలో రెండ్రోజులుగా మోస్తరు వర్షాలు కురువగా, మంగళవారం సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ , వికారాబాద్, సిద్దిపేటతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్టు పేర్కొన్నది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో 6.4 సెం.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని వివరించింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం కొంతమేర స్తంభించిందని తెలిపింది. వచ్చే 72గంటలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసినట్టు పేర్కొన్నది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికి వచ్చిన వరి, మామిడి, మిర్చి తోటలు ఈదురుగాలలు ధాటికి దెబ్బతిన్నాయి. ఇప్పటికే పలు కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం ఈ వర్షానికి తడిసిముద్దయింది.