Road Accident | కుత్బుల్లాపూర్, జూలై 8 : పది నిమిషాలు దాటితే వాళ్లు బుక్ చేసుకున్న హోటల్ చేరుకొని ప్రాణాలు కాపాడుకునే వాళ్లేమో.. అంతలోనే ఆ కుటుంబం రోడ్డు ప్రమాదంతో అగ్నికి ఆహుతులయ్యారు. ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులతోపాటు తమ పిల్లలు పూర్తిగా బూడిదయ్యారు. ఈ ఘోర ప్రమాదం బాధిత కుటుంబానికి కేవలం వారి దంతాలు, ఎముకలు మాత్రమే మిగిల్చి ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ నెల 6న రాత్రి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో నగరంలోని కొంపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో ఉన్న బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నారు. కొంపల్లిలోని ఎన్సీఎల్ నార్త్ కాలనీకి చెందిన రవి- అనిత దంపతులకు కుమార్తె తేజస్విని, కుమారుడు ఆకాష్ ఉన్నాడు. ఆకాష్ కూడా అమెరికాలోనే ఉంటాడు. అల్వాల్‌లో జూపిటర్ కాలనీకి చెందిన పశుపతినాథ్ గిరిజ దంపతులకు కుమారుడు శ్రీ వెంకట్ , కుమార్తె దీపిక ఉన్నారు. శ్రీ వెంకట్‌కు కొంపెల్లిలోని నార్త్ ఎన్సీఎల్ రవి-అనిత దంపతుల కుమార్తె తేజస్వినితో 2012లో పెళ్లయింది. వీరి కొడుకు సిద్ధార్థ (9) నాలుగో క్లాస్ చదువుతుండగా.. కూతురు మృద (7) రెండో క్లాస్ చదువుతుంది.
శ్రీ వెంకట్- తేజస్విని అమెరికా డల్లాస్‌లో ఏడాది క్రితం ఇల్లు కొనుక్కొని అక్కడే నివాసం ఉంటున్నారు. వెంకట్ అక్క దీపిక అట్లాంటాలో ఉంటుంది. తేజస్విని చిన్నాన్న నాగరాజు కూడా అట్లాంటలోనే ఉంటాడు. ఇరువురికి కుటుంబాల ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. వారం రోజులపాటు సెలవులను ఆనందంగా గడపటం కోసం వెళ్లారు. గతంలో రెండు మూడుసార్లు కారులోనే వచ్చిపోయారు. ఇదే క్రమంలో తిరుగు ప్రయాణంలో ఈ నెల 6న రాత్రి శ్రీ వెంకట్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కారులో తాము ఉండే డల్లాస్‌కు బయలుదేరారు.
మార్గమధ్యలోని గ్రీన్ కౌంటీ వద్ద శనివారం అర్ధరాత్రి ఓ మినీ ట్రక్కు ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో వీరంతా కారులో సజీవ దహనమయ్యారు. కాగా కారును ఢీ కొట్టిన ట్రక్కు రాంగ్ రూటులో రావడంతోపాటు అప్పటికే రాంగ్ రూట్లో వస్తున్న ట్రక్కుపై అక్కడి పోలీసులకు స్థానికులను 10 ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. కారు పూర్తిగా కాలిపోవడంతో మృతుల ఎముకలను,దంతాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి, డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు.
10 నిమిషాల్లో అయితే బుక్ చేసుకున్న హోటల్‌కు..
ప్రమాదం జరిగే ముందు పది నిమిషాల్లో అయితే వాళ్లు బుక్ చేసుకున్న హోటల్‌కు చేరుకునేవారు. కానీ అంతలోనే విధి ఆ కుటుంబాలను తీవ్ర విషాదానికి గురిచేసింది. 24 గంటల్లో మృతుల దంతాలను, ఎముకలను తల్లిదండ్రులకు అమెరికా పోలీసులు ఇవ్వనున్నట్లు బాధిత బంధువులు తెలిపారు.
కాగా శ్రీ వెంకట్ తల్లిదండ్రులు తన సోదరి వద్ద ఉండడంతో కారులో ప్రయాణిస్తే 12 గంటలు అవుతుందని ఆ రాత్రి అక్కడే పడుకుని తెల్లారి ఫ్లైట్‌లో వస్తామని చెప్పడంతో శ్రీ వెంకట్ తన భార్య పిల్లలతో కారులో ప్రయాణించి దుర్మరణం పాలయ్యారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు