బోడుప్పల్ : తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని రాష్ట్ర అటవీ శాఖ ప్రధానధికారి ఎంజె.అక్బర్ అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పల్లవి పాఠశాలలో విద్యార్థులకు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు చెట్లు జీవకోటికి ఆధారం అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హజరై విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్, పాఠశాల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యశస్వీ, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.