మేడ్చల్: తెలంగాణలో దరిద్రపు గొట్టు కాంగ్రెస్ పాలన మొదలయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (MLA Mallareddy) అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలన్నీ ఎగ్గొడుతుందని ఆరోపించారు. గండిమైసమ్మ సమీపంలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అధ్యక్షతన దీక్షా దివస్‌ను(Deeksha Diwas) ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించిన కేసీఆర్ (KCR) 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని అన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ అధికారంలో ఉంటే బాగుండేదని ప్రజలందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రజల తరపున పోరాడుదామని పిలుపునిచ్చారు.
శాసనమండలి మాజీ చైర్మన్, మేడ్చల్ జిల్లా దీక్షా దివస్ ఇన్చార్జి స్వామిగౌడ్ (Swamygoud) మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించాడని, అలాంటి తెలంగాణలో కొందరు మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోల్పోకుండా ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు పోరాటం సిద్ధమని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తదితరులు మాట్లాడారు.
దీక్షా దివస్ కార్యక్రమానికి ముందు అమరవీరుల స్థూపానికి నివాళుఅర్పించి, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మల్కాజిగిరి పార్లమెంట్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, కావ్య కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.