Operation Kagar | జవహర్‌నగర్, ఏప్రిల్ 4: ఖనిజ సంపదను కొల్లగొట్టడానికే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదివాసి గిరిజనులపై హత్యకాండాను మోపుతూ వందలాది మందిని పొట్టనపెట్టడం దుర్మార్గమని, వెంటనే ఆపరేషన్ కగార్‌ను విరమించుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. శివబాబు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని కోరుతూ ఈ నెల 8న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. శివబాబు ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టర్‌ను ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా శివబాబు మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలకు అడవులను, సందపదను కట్టబెట్టే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం రద్దుచేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడుతున్న అడవి బిడ్డలను రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఈ నెల 8న ఇందిరాపార్క్ వద్ద సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు ఐఎఫ్టీయూ పూర్తి మద్దతు తెలుపుతుందని అన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.