Govt assigned lands | దుండిగల్, జూలై 27 : గండిమైసమ్మ-దుండిగల్ మండలం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎటువంటి ఎన్ఓసీలు లేకుండానే గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అది మా బాధ్యత కాదంటే… మాది కాదు అంటూ అటు రెవెన్యూ, ఇటు మున్సిపల్ అధికారులు ఒకరిపై ఒకరు తోసుకుంటూ తప్పించుకుంటున్నారు తప్పితే చర్యలకు మాత్రం ఉపేక్షించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో జరుగుతున్నా.. ఈ ఆక్రమణల విషయంలో నిర్మాణదారులు పెద్దమొత్తంలో అధికారులకు ముట్టజెప్పడంతోనే కండ్లముందర నిర్మాణాలు జరుగుతున్నా, స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
వివరాలల్లోకి వెళితే.. గండిమైసమ్మ-దుండిగల్ మండలం, బొమ్మర పోచంపల్లి గ్రామపరిధిలోని సర్వేనంబర్ 120/1 ప్రభుత్వ అసైన్డ్ భూమిని అనసూయ అనే మహిళకు పాలిటికల్ సఫరర్ కోటా కింద గతంలో ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించింది. తదనంతరం సదరు భూమిని
కొనుగోలు చేసిన ఓ అధికార పార్టీ నేత కొనుగోలు చేసి, ఇతరులకు విక్రయించారు అయితే పలువురి చేతులు మారిన ఈ భూమికి సంబందించి రెవెన్యూ అధికారుల నుండి ఎన్వోన్ గాని, మున్సిపల్ అధికారుల నుండి అనుమతులు లేకుండానే ఇటీవల గదుల నిర్మాణం జరుగుతుంది.
స్థానికుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..
నిర్మాణదారులు ఏకంగా సదరు స్థలం వద్ద కిరాయి మనుషులతోపాటు సీసీ కెమెరాల నిఘా పెట్టి మరి నిర్మాణాలు చేపడుతూ అటుగా ఎవరైనా వెళితే భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. వాస్తవానికి రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి ఎన్వోసీ తీసుకోకుండానే, ఏడాది క్రితం మున్సిపల్ కార్యాలయం నుండి అక్రమమార్గంలో ఇంటి అనుమతులు పొందగా.. స్థానికుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిని రద్దుచేసినట్లు స్వయంగా మున్సిపల్ కమిషనరే స్పష్టంగా పేర్కొంటున్నారు. అయినప్పటికీ నిర్మాణదారులు మాత్రం గదులు నిర్మించడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై తహసిల్దార్ మతిన్ను వివరణ కోరగా అనుమతి లేని నిర్మాణాలను అడ్డుకోవాల్సింది తాము కాదని, మున్సిపల్ అధికారులని నెపం మున్సిపల్ అధికారులపై తోస్తుండగా, ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత తమది కాదని, రెవెన్యూ అధికారులదేనని కమిషనర్ వెంకటేశ్వర్నాయక్ పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తుందంటున్నారు స్థానికులు. నిజానికి ప్రభుత్వభూములను రక్షించే బాధ్యత రెవెన్యూ అధికారులదే అని ఎవరైనా నిలదీస్తే తహసీల్దార్ పొంతన లేని సమాధానాలు చెపుతుండటం గమనార్హం.
ఈ వ్యవహారంలో నిర్మాణదారులు ఆయా విభాగాల అధికారులను మేనేజ్ చేయడంతో ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ తప్పించుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయంలో జిల్లా అదనపు కలెక్టర్ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించినా.. ఇరు శాఖల అధికారులు పెడచెవిన పెట్టడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు స్థానిక ప్రజలు. గత మూడేళ్ల కిందట సుచరిత తహసీల్దారుగా ఉన్న సమయంలో ఇక్కడ కొందరు నిర్మాణాలు చేపట్టగా ఆమె వాటిని కూల్చివేసినట్లు గుర్తు చేశారు.
స్థలం ఒక చోట.. నిర్మాణాలు మరోచోట…
వాస్తవానికి సర్వేనెంబర్ 120/1లో అనసూయ అనే మహిళకు పొలిటికల్ సఫారర్ కోటా కింద 5 ఎకరాలు గతంలో ప్రభుత్వం కేటాయించిన మాట వాస్తవమే అయినా ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతుంది మాత్రం సర్వేనెంబర్ 125/ 28 ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఉందని స్థానికుల పేర్కొంటున్నారు. కండ్ల ముందర ఇంత అన్యాయం జరుగుతున్నా అధికారులు ఎందుకు దృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. బిడ్డను బస్టాండ్లో వదిలి వెళ్లిన తల్లి
KTR | ఎరువులు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Snake in Temple | ఆలయంలో పాము కలకలం.. భయంతో హడలిపోయిన భక్తులు.. Video