KTR | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనవరిలోనే ఎరువులు కొని బఫర్ స్టాక్ చేసుకునేదని కేటీఆర్ గుర్తుచేశారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు యూరియా దుకాణాల ముందు లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు కనిపించలేదని అన్నారు. టైం కి యూరియా, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు.
Gift A Smile కార్యక్రమంలో భాగంగా పరకాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళలకు కేటీఆర్ కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నాడని అన్నారు. పరకాల నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించుకున్న 3 వేల మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సతాయిస్తున్నదని మండిపడ్డారు. లబ్ధిదారుల తరపున పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోర్టుకు పోతే, న్యాయస్థానం చెప్పినా కూడా రేవంత్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. 3000 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగేదాకా పోరాడుదాం.. అసెంబ్లీలో కొట్లాడుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ షాన్గా ఉన్న ఆజం జాహీ మిల్లు సమైక్య పాలనలో మూతపడిందని.. నాటి సమైక్య పాలకులు ఆజం జాహి మిల్లు భూములను అడ్డుకి పావు సేరు అమ్ముకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆజం జాహి మిల్లు మూతపడడంతో వరంగల్ జిల్లాలోని పద్మశాలీలు బతుకుదెరువు కోసం భీమండి, సూరత్, షోలాపూర్, వలస పోయారని నాటి రోజులను గుర్తుచేశారు. అలా వలస పోయిన వాళ్లందర్నీ స్వరాష్ట్రంలో తిరిగి వెనక్కి తెప్పించుకుంటామని ఉద్యమ కాలంలో కేసీఆర్ చెప్పారని.. అందుకు అనుగుణంగానే తెలంగాణ వచ్చాక ఇదే వరంగల్ గడ్డపై 1500 ఎకరాల్లో భారత దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ది, పట్టుదల, నిజాయితీ కారణంగా కేరళకు చెందిన కీటెక్స్ సంస్థ 2400 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిందన్నారు. దాంతో పాటు జంగ్ వన్ అనే కొరియా సంస్థ, గణేష్ అనే బొంబాయి సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడంతో 2022- 23 నాటికి ఒక టెక్స్ టైల్ పార్క్ లో ఒక యూనిట్ ను ప్రారంభించామన్నారు. శిక్షణ పొందుతున్న ఆడబిడ్డలకు కాకతీయ టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని స్పష్టం చేశారు. శ్రామికులుగా సూరత్ కు వలస పోయిన కార్మికులను తిరిగి పారిశ్రామికులుగా తెలంగాణకు రప్పించేందుకు కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మడికొండలో 100 ఎకరాల్లో ఏర్పాటుచేసిన షెడ్లు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.