BC Reservations | మేడ్చల్, జూన్ 21 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. బీసీల హక్కులకు జీవో జారీ చేయకపోతే, వాటి ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రంలో బీసీ ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు.
మేడ్చల్లో ఆదివారం బీసీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్ ను కల్పించకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తుందన్నారు. నిధులు, ఇతర విషయాలపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో మాత్రం మాట్లాడటం లేదన్నారు. అఖిల పక్షంతో సభ్యులతో ఢిల్లీ వెళ్దాం, కేంద్ర ప్రభుత్వాన్ని కలుద్దామని చెప్పిన ఆయన ఆ ఊసే తీయడం లేదన్నారు. రాష్ర్టంలో కుల గణన జరిగింది, ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తమ మేనిఫెస్టోలో పేర్కొన్నదని, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామన్న ప్రధాన హామీతోనే కాంగ్రెస్ను గద్దెనెక్కిందన్నారు. 42 శాతం రిజర్వేషన్ హామీని అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు. బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని, మంత్రి పదవుల్లో కూడా న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాధాన్యత లేని, బడ్జెట్ లేని శాఖలను బీసీలకు కట్టబెడుతూ బడ్జెట్ ఉన్న శాఖలను మాత్రం ఉన్నత వర్గాలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం ఇదేనా..?
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వచించే సామాజిక న్యాయం ఇదేనా..? అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, రిజర్వేషన్ కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయ సాధన కోసం, సమానత్వం కోసం బీసీ రాజ్యాధికార సమితి కృషి చేస్తుందన్నారు. ఈ దిశగా బీసీల నాయకత్వ నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో చేపడుతూ ఇప్పటికే 25 జిల్లాలలో కమిటీలను పూర్తి చేశామన్నారు.
బీసీలను బలమైన సంఘటిత శక్తిగా మార్చడానికి కోటి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బీసీలను రాష్ట్రంలో దేశంలో బలమైన రాజకీయ శక్తిగా మార్చడమే తమ అంతిమ లక్ష్యమని.. అందుకోసం బీసీలు బలంగా ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో త్వరలోనే పూర్తిస్థాయి నియోజకవర్గ, పట్టణ, డివిజన్, మండల కమిటీలను పూర్తి చేస్తామన్నారు. అంతకు ముందు బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి మంది బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా బీసీ నాయకులతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్ , కార్యవర్గ సభ్యులు రాములు ,రాష్ట్ర విద్యార్థి నాయకులు శ్రీశైలం కురుమ తదితరులు పాల్గొన్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి