Road Accident | రాయపోల్, జూన్ 21 : మండలంలోని మంతూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో నియంత్రణ కోల్పోవడంతో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన కుంట దుర్గాప్రసాద్ (36) గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కార్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. తమ్ముడి ఇంట్లో శుభకార్యం కోసం రాయపోల్కి వచ్చాడు. సిద్దిపేట మీదుగా హైదరాబాద్కు శనివారం ఉదయం గ్రామం నుంచి బయలుదేరాడు.
సిద్దిపేట వెళ్లే క్రమంలో మార్గమధ్యలో మంతూర్ గ్రామ సమీపంలో అతివేగంతో కారుని నడపడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు కుంట నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘుపతి తెలిపారు.