Virosh | రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకల అనంతరం నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు, మీడియా ప్రతినిధులు ఈ జంటకు ఘన స్వాగతం పలికారు. పెళ్లి అనంతరం తొలిసారి నగరంలో అడుగుపెట్టిన ఈ జంట ముఖాల్లో ఆనందం, కొత్త జీవితం పట్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. రష్మిక సిగ్గుపడుతూ విజయ్ వెంట నడవడం అభిమానులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ప్రముఖ ఐటీసీ మెమెంటోస్ హోటల్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. రెండు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం ప్రత్యేకంగా వేడుకను నిర్వహించారు. ఉదయం 10:10 గంటలకు విజయ్ కుటుంబ ఆచారాల ప్రకారం ముహూర్తం నిర్వహించగా, సాయంత్రం రష్మిక సొంత ప్రాంతమైన కొడగు (కూర్గ్) సంప్రదాయం ప్రకారం మరోసారి కార్యక్రమం జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఇక పెళ్లి తర్వాత ఈ జంట ఢిల్లీలో నరేంద్ర మోదీ, అమిత్ షా లను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానికి వెండి గణేశ విగ్రహాన్ని బహుకరించి, మార్చి 4న హైదరాబాద్‌లో జరిగే తమ రిసెప్షన్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖ పంపినట్లు సమాచారం. మార్చి 4న బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణహోటల్లో సాయంత్రం 7 గంటల నుంచి గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వంటి సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇప్పటికే ఆహ్వానం అందినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. “నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా చేసుకున్నాను” అంటూ విజయ్ చేసిన పోస్టు, “మీ భార్యగా పిలవబడటం నాకు గర్వంగా ఉంది” అంటూ రష్మిక షేర్ చేసిన సందేశం అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. రష్మిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు 24 గంటల్లోనే లక్షలాది లైక్స్ రావడం విశేషం. ఈ జంట సోషల్ మీడియాలో రికార్డుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్‌లోని తమ నివాసంలో వివాహానంతర పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం ఈ జంట తమ తదుపరి చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొననున్నారు.