సూర్యాపేట, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ జీఓకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఫిబ్రవరి తొలి వారంలో పెద్దగట్టు (Peddagattu) లింగమంతుల సామి జాతర కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ జీఓ విడుదలైంది. నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా నిధులు విడుదల కాకపోవడం పట్ల అప్పులు చేసి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి ఓపిక నషించడంతో ఆందోళనలకు సిద్దం అవుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగట్టు జాతర సందర్బంగా కనీస మౌళిక సదుపాయలు కల్పించకపోగా ప్రతి జాతరకు రూ.25 నుంచి 75వేలకు మించి విడుదల చేయలేదు. అలాంటిది రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతి ఏటా కోట్లాది రూపాయలు విడుదల చేయించడంతో జగదీష్‌రెడ్డికి ముందు తరువాత అనే రీతిన అభివృద్ది చెందింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చిన జీఓకే విలువ లేకపోవడం పట్ల మళ్లీ అదే పరిస్థితి వస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారమే ఏకైక పరమావదిగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు.. అబద్దపు హామీలు అన్నీ ఇన్నీ కావు.. గత ఏడాదిన్నరలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు దాదాపు 98శాతం తేలిపోయాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించలేని దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుంది. మాట మాట్లాడితే డబ్బులు లేవు… ఖజానా ఖాళీ ఉంది అంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతూ కనీసం ఎక్కడైనా నిధులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విడుదల చేసిన జీఓలను గాలికి వదిలేస్తున్న ఉదంతాలు ప్రభుత్వ దయనీయతకు అద్దం పడుతుంది.
బీఆర్ఎస్ హయాంలో ఏదైనా జీఓ విడుదలైతే దానికి సబంధించి వారం లోపే నిధులు విడుదలయ్యేది. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెలలు గడిచినా నిధులు రావడం లేదు. ఇప్పటికే కోదాడ, హుజూర్‌నగర్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా పలు పనులకు సంబంధించి జీఓలు జారీ చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఇతర పనులు అలా ఉంటే దేవుడికి కూడా శఠగోపం పెడుతున్నారు. సూర్యాపేటకు సమీపంలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్బంగా మౌళక సదుపాయలు, కొన్ని శాశ్వత పనులు చేపట్టేందుకు గాను రూ.5 కోట్లు విడుదల చేస్తూ జీఓ విడుదల చేసి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన లింగమంతుల స్వామికి 2014కు పూర్వం గత ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు యాభై వేలు మంజూరీ చేసిన దాఖలాలు లేకపోగా కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదు.
కానీ తెలంగాణ ఏర్పాటు అనంతరం మంత్రిగా పనిచేసిన జగదీష్‌రెడ్డి చొరవతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఐదు జాతరలకు కలిపి దాదాపు రూ.15 కోట్లకు పైనే ఖర్చు చేయడంతో పెద్దగట్టు రూపురేఖలే మరిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఫిబ్రవరిలో జాతర జరుగగా జాతర సమయం దగ్గర పడిన తరువాత విమర్శలు తట్టుకోలేక రూ.5 కోట్లు మంజూరీ చేస్తూ జీఓ విడుదల చేసింది. దీంతో జాతర నిర్వహణ కోసం దాదాపు 14 శాఖల ఆధ్వర్యంలో జరిగిన పనులను తరువాత నిధులు ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్లతో చేయించారు. కానీ నాలుగు నెలలైనా నిధులు విడుదల కాకపోవడం… కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. జీఓలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు… వెంటనే నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.