Drown | జవహర్‌నగర్, ఏప్రిల్ 6 : కౌకూర్ దర్గాకు దైవ దర్శనానికని వచ్చి చెరువులోకి దిగిన వ్యక్తి గల్లంతైన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి యాప్రాల్ కౌకూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
జవహర్‌నగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి యాప్రాల్ కౌకూర్ దర్గాకు ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ గౌస్(35) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి దర్శనానికి వచ్చారు. శనివారం దర్శనానికి వచ్చిన అనంతరం మహ్మద్‌గౌస్ స్నానం చేయాలని చెరువులోకి దిగడంతో లోతు తెలియక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
గమనించిన కుటుంబసభ్యులు గౌస్ కోసం వెతకగా కనిపించలేదు.. వెంటనే జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకి లభించలేదు. 24 గంటలు గడుస్తున్నా గౌస్ మృతదేహం కనిపించలేదని పోలీసులు తెలిపారు.
దైవ దర్శనం కోసం దేవుడి వద్దకు వస్తే.. ఆ దేవుడే శాశ్వతంగా తీసుకెళ్లాడని గౌస్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం బయటకు తీసేందుకు పోలీసులు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారని జవహర్‌నగర్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.