జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తున్నది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో కోత పెట్టాలని భావించి గందరగోళానికి తెరతీసింది. ఇండ్ల స్థలాల ఊసు లేనే లేదు. సంక్షేమ నిధి ముచ్చట లేదు. తాజాగా జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను గాలికి వదిలేసి అక్కసును చాటుకున్నది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ఉద్దేశపూరిత కోత పెట్టడానికి జీవోల మీద జీవోలు ఇస్తున్నది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో సంబంధిత శాఖామంత్రి, అధికారులక మధ్య పొంతనలేని మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఆ శాఖలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి, జర్నలిస్టుల మధ్య వారధిగా ఉంటూ పరిస్థితిని చక్క బెట్టాల్సిన మీడియా అకాడమీ చైర్మన్ పట్టించుకోవడమేలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డు జర్నలిస్టులనే భేదం లేకుండా అర్హులైన అందరినీ జర్నలిస్టులుగా గుర్తించింది. అక్రెటిజేషన్లు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు ఆత్మగౌరవంతో ఉండాలని 23 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చింది. బ్యూరో జర్నలిస్టులతో పాటు డెస్క్ జర్నలిస్టులకు సైతం 2016 లో అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులను మొదట్లో వేరు చేసి చూడాలని భావించింది. రెండు కార్డుల విధానానికి తెరతీసింది. బ్యూరో వారికి అక్రెడిటేషన్ కార్డులు, డెస్క్ వారికి మీడియా కార్డులు ఇవ్వాలని జీవో నంబర్ 252 తెచ్చింది. ఆ జీవోకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ సంఘాలు 33 జిల్లాల్లో ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రభుత్వ ప్రతినిధులలు జర్నలిస్టు సంఘాలను పిలిచి చర్చించారు.అందరికీ ఒకే కార్డు విధానం తీసుకువస్తామని సవరణ జీవో 103 ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో మెరుగైన చర్యలు తీసుకున్నది. 2014లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆవిర్భావ సభలో అప్పటి కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పలుహామీలు ఇచ్చారు. సీఎంగా బాధ్యతల చేపట్టిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా క్యాష్‌లెస్ హెల్త్ కార్డులను ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈజేహెచ్ఎస్ పేరిట హెల్త్ పాలసీ అమలు చేశారు. కార్పొరేట్ దవాఖానలతోపాటు వెల్నెస్ సెంటర్లలో జర్నలిస్టులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టి 7.14 లక్షల ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అదికూడా అసంబద్ధంగానే జర్నలిస్టుల హెల్త్‌స్కీమ్ గురించి ప్రస్తావనే చేయలేదు. భవిష్యత్తులో జర్నలిస్టులు ఎక్కడ ఉచిత వైద్యసౌకర్యాన్ని పొందాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వం జర్నలిస్టులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. ఈ మేరకు జీవో నంబర్ 22 విడుదల చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఆ పాలసీకి ప్రీమియం కూడా చెల్లించడంలేదు.
ఈహెచ్ఎస్ విధానంతో దాదాపు 25 లక్షల మందికి అందుబాటులోకి వచ్చిన ఉచిత వైద్యసేవలు జేహెచ్ఎస్ ప్రవేశపెడితే జర్నలిస్టుల కుటుంబ సభ్యులు మొత్తంగా కలిపితే రెండు లక్షలు కూడా ఉండరు. వారు ఈ ప్రభుత్వానికి భారమయ్యారా? అనే ప్రశ్న ఇప్పుడు జర్నలిస్టు సమాజాన్ని ఆవేదనకు గురిచేస్తున్నది.
జేఎన్జే విషయంలో ఇరవై ఏండ్లుగా ఊగిసలాట ఉన్నది. గత ప్రభుత్వం నిజాంపేటలో 332 సర్వే నంబర్లోని స్థలాన్ని 2018 లోనే సదరు సొసైటీకి అప్పగించింది. మరొకటి ఇచ్చేందుకు న్యాయపరమైన చిక్కులను ఛేదించి ఇచ్చే దిశగా ఆలోచన చేసింది. ఆలోపే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ వెనక్కి వెళ్లింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడంలేదు. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు సహా జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రమాద బీమా సొమ్మును సైతం చెల్లించడానికి కాంగ్రెస్ పాకులకు చేతులు రావడం లేదు.
కేసీఆర్ హయాంలో ఇచ్చిన రూ.42 కోట్ల సంక్షేమ నిధితోనే ప్రస్తుత మీడియా అకాడమీ నెట్టుకొస్తున్నది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆధునిక పాఠ్యంశాలను తయారు చేయించారు. పుస్తకాలు ముద్రించారు.
ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ నామమాత్రంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన పదవిని మరో రెండేండ్లపాటు రెన్యూవల్ చేసుకునే విషయంలో ఉన్న ఆసక్తి.. జర్నలిస్టుల సమస్యల పరిష్కార విషయంలో చూపించడం లేదనే పాత్రికేయులు ఱెద్గహం వ్యక్తంచేస్తు న్నారు. జర్నలిస్టుల మధ్య వివక్ష చూపించే విధానాలను విడనాడాలని సూచిస్తున్నారు.
మీడియాలో పని చేస్తున్న ఫీల్డ్ రిపోర్టర్లను తప్పా మిగితావారిని జర్నలిస్టులుగా గుర్తించేందుకు నిరాకరించడమే ఆయన తత్త్వానికి నిదర్శనమని మీడియా లోకం కోడై కూస్తున్నది. తెలంగాణ స్వయం పాలనలో జర్నలిస్టులకు జరిగే అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ టీయూడబ్ల్యూజే అంగీకరించబోదు. జర్నలిస్టుల ఆత్మగౌరవం కోసం పోరాడుతాం. అర్హులైన జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వం గుర్తింపునివ్వాలి. హెల్త్ కార్డులు సహా సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలి.
– (వ్యాసకర్త: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి )
-అస్కాని మారుతీ సాగర్