OTT Movies | ఆగస్టు నెల తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్, యానిమేషన్, వెబ్ సిరీస్‌లు ఇలా అన్ని జానర్లకు చెందిన పలు చిత్రాలు, సిరీస్‌లు ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని ‘లెనిన్’ కూడా ఈ వారమే డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మరి ఈ వారం ఏ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో విడుదల కానుందో చూద్దాం.
‘ఉయిర్’ – ఆగస్టు 4 నుంచి జియోహాట్‌స్టార్‌లో
మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఉయిర్’ ఆగస్టు 4 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. రాజేష్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులోకి రానుంది.
‘లెనిన్’ – ఆగస్టు 7 నుంచి జీ5లో
అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విజయవంతమైన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
‘మెయిన్ వాపస్ ఆవూంగా’ – నెట్‌ఫ్లిక్స్‌లో
ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా ‘మెయిన్ వాపస్ ఆవూంగా’ ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వేదాంగ్ రైనా, శర్వరి, దిల్జిత్ దోసాంజ్, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భావోద్వేగ కథతో మంచి స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉండదు.
‘ఇదయం మురళి’ – తెలుగు డబ్బింగ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో
అథర్వ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ డ్రామా ‘ఇదయం మురళి’ కూడా ఆగస్టు 7 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆకాష్ బాస్కరన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కయాడు లోహర్, ప్రీతి ముఖుందన్ హీరోయిన్లుగా నటించగా, ఫహద్ ఫాసిల్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ‘హృదయం మురళి’ పేరుతో తెలుగు డబ్బింగ్లో కూడా విడుదల కానుంది.
‘వధంతి’ సీజన్ 2 – అమెజాన్ ప్రైమ్ వీడియోలో
తమిళంలో విశేష ఆదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వధంతి’ రెండో సీజన్ ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఎం. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సీజన్లో కొత్త కేసు, కొత్త ట్విస్టులు ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఒకేసారి అందుబాటులో ఉంటుంది.
‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ – నెట్‌ఫ్లిక్స్‌లో
కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా రూపొందిన మిలిటరీ డ్రామా సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ తెలుగు భాషలో కూడా అందుబాటులోకి రానుంది.
‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ – జియోహాట్‌స్టార్‌లో
యానిమేషన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ ఆగస్టు 7 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్, కామెడీతో రూపొందిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్లో కూడా విడుదల కానుంది.
‘వంద దేవుళ్లు’ – జీ5లో
విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘వంద దేవుళ్లు’ (తమిళంలో నూరు సామి) ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ససి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో హృదయాన్ని తాకే కథతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం ప్రకటించినవి ఇంతవరకే అయినప్పటికీ, ఓటీటీ సంస్థలు చివరి నిమిషంలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రకటించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వరుస వినోదాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ‘లెనిన్’, ‘వధంతి 2’, ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వంటి చిత్రాలు, సిరీస్‌లపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.