Bridge Construction | జగద్గిరిగుట్ట ఏప్రిల్ 2 : కూర్చోమని చెప్పి గోడకుర్చీ వేయించినట్టుంది ఇంజనీరింగ్ అధికారుల తీరు. షాపూర్ నగర్ నుంచి జగదిరిగుట్ట వెళ్లే పైప్లైన్ రోడ్డులో రూ.కోటితో చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు 6 నెలలుగా సాగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన దారి సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే మలుపులు మధ్యలో విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉండి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
పది రోజుల క్రితం కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్డంతా గోతుల మయంగా మారింది. దీంతో వాహనదారుల ప్రయాణం పెనం మీద నుంచి పోయిలో పడ్డ చందంగా తయారైంది. ఎండకు దుమ్ములో గోతులమయం.. పైగా స్తంభాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాత్రిపూట వాహనాలు ఢీకొనకుండా స్తంభాలకు అడ్డుగా భారీ కేడ్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అధికారులు కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు.
బ్రిడ్జి ప్రధాన నిర్మాణం పూర్తయినా అప్రోచ్ రోడ్డు సైడ్ వాల్స్ నిర్మించాల్సి ఉంది. పూర్తి చేసి అందుబాటులోకి తేవాలంటే మరో నెల రోజులు పట్టేలా కనిపిస్తోంది. అంతవరకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ రహదారిని చదును చేయాలని వాహనదారులు కోరుతున్నారు.