అల్వాల్ ఫిబ్రవరి 9 : మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని బస్తీలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం అల్వాల్ డివిజన్ వెస్ట్ వెంకటాపురం దినకర్నగర్లో రూ 2.3 కోట్లు వ్యయంతో చేపడుతున్న బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ చింతల శాంతిశ్రీనివాస్రెడ్డితో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దినకర్ నగర్లో కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్య ఉందని ఈ విషయాన్ని స్థానిక కాలనీవాసులు తన దృష్టికి తీసుకురావడంతో నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు.
పలు కాలనీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నానని పేర్కొన్నారు. డ్రైనేజీ, మంచినీరు రోడ్లు పార్కుల వంటి అభివృద్ది పనులే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను కుడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ ప్రశాంతి, ఏఈ అరుణ్, రామారావు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు శరణ్గరి, సాజీద్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.