కమలాపూర్, అగస్టు 13: పైసా ఖర్చు లేకుండా పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమ్రంతి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కట్టిన ఇండ్లకు అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. ఇవేమీ లేకుండానే ఇటీవల మంత్రులు ఆగమేఘాల మీద వీటిని ప్రారంభించి నలుగురు లబ్ధిదారులకు మాత్రమే పట్టాలిచ్చి వెళ్లిపోయారు.
అధికారులు మిగతా వారికి ఇంకా ఇవ్వకపోగా జాబితాను సైతం గోప్యంగా ఉంచుతున్నారు. గూడూరులోని డబుల్ ఇండ్లకు మాత్రమే విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులు కమలాపూర్‌లోని ఇళ్ల వద్ద స్తంభాలు మా త్రమే వేసి చేతులు దులుపుకున్నారు. మంత్రుల రాక సందర్భంగా హడావిడి చేసిన అధికారులు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల తర్వాత అరకొర వసతులతో ఇండ్లను ప్రారంభించి తామే ఇచ్చామని చెప్పుకునేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు విమర్శిస్తున్నారు.
కమలాపూర్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిచ్చినప్పటి లాగానే ఉన్నాయి. నిర్మాణం పూర్తి అయిన ఇండ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సౌకర్యం కల్పించలేదు. సుమారు వంద ఇండ్లకుపైగా సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేసి వదిలేయగా, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గృహ నిర్మాణశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పలుమార్లు సందర్శించినా ఇండ్ల రూపు రేఖలు మారలేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి రంగులు వేసిన ఇండ్లను మంత్రులు ప్రారంభిస్తున్నారని కేవలం విద్యుత్ స్తంభాలు మాత్రమే వేశారు.
ఎలాంటి వసతుల్లేకుండా తామెలా నివాసముండాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మంత్రులు ప్రారంభించి ఐదు రోజులు గడస్తున్నా సౌకర్యాలపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని అడుగుతున్నారు. ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు పట్టాలివ్వాలని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదంటున్నారు.
పేదల కోసం కేసీఆర్ కట్టిచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లు కాంగ్రెస్ నాయకులకు ఆదాయ వనరుగా మారాయి. రూ. 50 వేలు ఇస్తేనే డబుల్ బెడ్రూం ఇల్లు వస్తదని కాంగ్రెస్ నాయకులు మధ్యవర్తితో అడిగిచ్చినట్లు ఓ లబ్ధిదారుడు మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇటీవల కమలాపూర్ మండలంలో మంత్రులు ఇండ్లను ప్రారంభించినప్పటికీ అధికారులు ఇంకా లబ్ధిదారుల జాబితాను ప్రకటించకపోవడం కాంగ్రెస్ నాయకుల బేరాలకు బలం చేకూరుస్తున్నాయి.
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. డబ్బులిస్తేనే డబుల్ బెడ్రూం ఇైల్లెనా, జాగైనా వస్తుంది’ అని వాళ్లు అడుగలేక మధ్యవర్తితో అడిగిచ్చినట్లు ఓ లబ్ధిదారుడు పేర్కొన్నాడు. తనలాంటి పేదలను ఎంపిక చేసింది చాలా తక్కువని, డబ్బులిచ్చిన, ఆర్థికంగా ఉన్నవాళ్లకే ఇండ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆడియో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నాయకులు, అధికారుల మధ్య ఒప్పందంతోనే లబ్ధిదారుల జాబితాను గోప్యంగా ఉంచుతున్నారా? అనేది తేలాల్సి ఉంది.