దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తిగా నిరాశ కలిగించాయి. ప్రజల సమస్యలకు వేదిక కావాల్సిన సభ, పాలకప్రతిపక్షాల ఘర్షణలు, పరస్పర ఎగతాళితో నీరుగారింది. చర్చలు జరుగాల్సిన చోట నినాదాలు, సమాధానాలు ఇవ్వాల్సిన చోట మౌనం.. వెరసి విలువైన సభాసమయాన్ని పూర్తిగా వృథా చేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గైర్హాజర్ చుట్టూనే వాదవివాదాలు అల్లుకోవడంతో దేశ భద్రత, అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన కీలక ప్రశ్నలు గాలికెగిరిపోయాయి. ప్రతిపక్షాలు మంత్రి గైర్హాజర్ ఏకైక ఎజెండాగా సభను అడ్డుకున్నాయి.
రోజులకొద్దీ సభా సమయం వృథా అవుతున్నా అమిత్ షా సభకు వచ్చి సమాధానం ఇవ్వకపోవడం విడ్డూరం కలిగిస్తున్నది. కాక్రోచ్ ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్‌తో సహా రకరకాల అణచివేత పద్ధతులను పోలీసులు వినియోగించడం దేశవ్యాప్తంగా చర్చాంశమైన సంగతి తెలిసిందే. అందుకు ఆదేశాలిచ్చింది ఎవరు? ఢిల్లీ పోలీసుల నియంత్రణ బాధ్యత హోం మంత్రి అమిత్ షాదే. అందుకు ఆయన సభ ముందుకు వచ్చి జవాబుదారీ వహించాలి. ఒకవేళ ఆయన ఆదేశాలు ఇవ్వకున్నా పోలీసులు పాశవికంగా దాడి చేసి ఉంటే అది అది ఆయన అసమర్థత కిందకు వస్తుంది. ఈ తర్కంతో విపక్షం ఆయనను ఇరకాటంలో పెట్టడం, ఆయన సభకు ముఖం చాటేయడంతో ప్రతిష్టంభన తీవ్రమైంది.
పాలకపక్షం వైఖరిలో బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపించింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా, చర్చలను తప్పించుకునేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. మెజారిటీ ఉన్నదన్న నమ్మకంతో పార్లమెంట్‌ను కేవలం బిల్లులు ఆమోదించే యంత్రంగా మార్చే ప్రయత్నం ఆందోళన కలిగిస్తున్నది. ఈ సమావేశాల్లో పేపర్ లీకుల నిరోధక బిల్లు మినహా మొత్తం 11 బిల్లులు పెద్దగా చర్చ జరుగకుండానే మొక్కుబడిగా ఆమోదం పొందడం పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం తప్ప మరొకటి కాదు. అందులో కొన్నింటిని కేవలం మూడు నాలుగు నిమిషాల్లో చుట్టబెట్టేయడం గమనా ర్హం. కాగా, విదేశీ విరాళాల సవరణ బిల్లు మాత్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు.
పార్లమెంట్ అంటే కేవలం చట్టాలు చేయడమే కాదు, అది ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక కూడా. జూలై 20న మొదలైన వర్షాకాల సమావేశాల పొడవునా కేవలం పేపర్ లీకేజీ, అయోధ్య ఆలయ విరాళాల చోరీపైనే కొనసాగిన ప్రతిష్టంభన గురువారం సభ నిరవధికంగా వాయిదా పడింది. ఇక ప్రతిపక్షాల పాత్ర కూడా విమర్శలకు అతీతం కాదు. నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, అదే పేరుతో సభను పూర్తిగా స్తంభింపజేయడం వల్ల ప్రజల సమస్యలు పక్కకు పోతా యి. గైర్హాజర్ అంశాన్ని ప్రస్తావించడం సరైనదే అయినప్పటికీ, దానిని రాజకీయ వ్యంగ్యాస్త్రంగా మలచి సభను చివరిదాకా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ఉపకరించే అంశం కాదు. ప్రజల తరఫున సమస్యలపై మాట్లాడాల్సినవారు, చర్చకు అవకాశాన్ని తామే మూసివేయడం విచారకరం. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, విద్య, వైద్య రంగాల్లో సమస్యల వంటి ఎన్నో కీలక అంశాలు చర్చకు రాకుండానే సమావేశాలు ముగిశాయి.
ప్రతి నిమిషం ప్రజల పన్నుల డబ్బుతో నడిచే పార్లమెంట్ సమయం వృథా చేయడం అంటే ప్రజల సొమ్మును వృథా చేయడమే. ఇది ఒకరోజు లేదా ఒక సీజన్ సమావేశాల సమస్య కానే కాదు. గత కొన్నేండ్లుగా పార్లమెంటు నిర్వహణ ఇదేతీరుగా సాగుతున్నది. పాలక పక్షం వైపు నుంచి పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం ఒక సమస్య అయితే, ప్రతిపక్షాలు నిరసనల మీదనే దృష్టి నిలుపడం వల్ల ప్రతిష్ఠంభన ఏర్పడుతున్నది. ఈ రెండూ కలిసి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. చర్చలు, సమాధానాలు లేకుండా, కేవలం నినాదాలతో నడిచే సభ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నది. ఇప్పటికైనా పాలక, విపక్షాలు తమ వైఖరిని పునఃపరిశీలించుకోవాలి. ఒకరిమీద మరొకరు పైచేయి సాధించడం కాదు, కావాల్సింది ప్రజా సమస్యలపై చర్చ.