Keesara | కీసర, ఫిబ్రవరి 18: కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాతర బ్రహ్మోత్సవాల్లో జిల్లా స్థాయి అధికారులు ఆరు రోజులపాటు కీసరగుట్టలోనే అందుబాటులో ఉండి జాతర ఏర్పాట్లను చూసుకోవాలని ఆదేశించారు.
కీసరగుట్టలో జాతర కో-ఆర్డీనేషన్ సమావేశాన్ని ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు హాజరైనారు. ఈ సందర్భంగా విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వేసవికాలం కావడంతో భక్తులకు క్యూలైన్లలో మజ్జిగ, నీటి సరఫరాను ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని సూచించారు. పార్కింగ్తో పాటు భక్తులు వచ్చే క్యూలైన్ల వద్ద భారీగా బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. రూ.300, 500 రూపాయల వీఐపీ క్యూలైన్లతో పాటు వీవీఐపీ ప్రోటోకాల్స్ విషయంలో ప్రత్యేక చొరు తీసుకోవాలని ఆదేశించారు.
సానిటేషన్ విషయంలో అధికారులు ఎప్పటికప్పడు ఆప్రమత్తంగా ఉండి గుట్ట పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెత్తా చెదారం లేకుండా చూడాలని దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ నాగమణిని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సంవత్సరం మొత్తం 1500 మంది స్టాఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, సానిటేషన్ విషయంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని కమీషనర్ నాగమణి చెప్పారు. వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని ఏరియాల్లో ఎమర్జెన్సీగా వాటర్ డ్రమ్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కరెంట్ విషయంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో సరిపడ్డ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో క్రీడాపోటీలను కూడా నిర్వహిస్తున్నామని, ఈ క్రీడలను జిల్లా విద్యా శాఖ చూసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని విజయేందర్ రెడ్డి అన్నారు.
ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వివిధ శాఖల అధికారులు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం అయ్యే జాతర వేడుకలను జాతర ముగిసే వరకు ఉండాలని సూచించారు. తాగునీటి విషయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆప్రమత్తంగా ఉండి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. వెహికల్ పాసులు, దర్శనం పాసులు ఉన్న వీఐపీ, వీవీఐపీ, ఎమ్మెల్యే, ఎంపీ, జడ్జీలకు ప్రోటోకాల్స్ పద్ధతి పాటించి వారి వాహనాలను మాత్రమే గుట్ట పైకి పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసరగుట్ట ఈఓ కట్టా సుధాకర్‌రెడ్డి, ఏసీపీ మహేశ్, కీసరగుట్ట ఆలయ ధర్మకర్తలు, కీసరగుట్ట వంశపారంపర్య ధర్మకర్తలు, జిల్లాస్థాయి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.