కుత్బుల్లాపూర్, మార్చి 31 : రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఫార్చునర్ కారు ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహేంద్ర చౌదరి (34) కొన్ని నెలల కిందట నగరానికి వలస వచ్చి కొంపల్లిలోని గార్డెన్ హౌసింగ్ సొసైటీ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నాడు.
ఈ నెల 30న మధ్యాహ్నం సమయంలో తన బంధువు లాలు చౌదరితో కలిసి సరుకులు తేవడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో కొంపల్లిలోని సినీ ప్లానెట్ ఎదురుగా జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా మేడ్చల్ నుంచి సుచిత్ర వైపుకు అతి వేగంతో దూసుకొచ్చిన కారు మహేంద్ర చౌదరిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.