కోదాడ, మార్చి 16 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు అన్నారు. సోమవారం కోదాడ తాసీల్దార్ కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, రైతు భరోసా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఇప్పటికీ అర్హులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సులతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు, గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం వల్ల విద్యార్థులు, యువత నష్టపోతున్నట్లు తెలిపారు.
ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, నడిగూడెం మండల అధ్యక్షుడు బండారు వీరబాబు, అనంతగిరి మండల అధ్యక్షుడు చింతకుంట్ల సతీష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎడ్లపల్లి వెంకట నరసయ్య, జిల్లా కార్యదర్శి ఎరగాని కళావతి, ఎరగాని రాధాకృష్ణ, రెడ్డిబోయిన జ్ఞానేంద్ర, మేకల నాగరాజు, ఎడ్లపల్లి రామారావు, వనం నాగేశ్వరావు, ఒంగోలు పిచ్చయ్య, కనుమర్లపూడి శ్రీహరి, రమేశ్ నాయక్ పాల్గొన్నారు.