– సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్
– జూలూరుపాడులో ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం
జూలూరుపాడు, మార్చి 16 : పశ్చిమ ఆసియాలో ఆధిపత్యం కోసం, చమురు వనరుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై జరుపుతున్న దురాక్రమణ దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జాతీయ నాయకుడు కెచ్చల రంగారెడ్డి అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్యం, రాజకీయ ఆధిపత్యం కోసం అమెరికా తన ‘పెంపుడు జంతువు’ ఇజ్రాయెల్‌తో కలిసి మారణహోమానికి తెగబడుతోందని ధ్వజమెత్తారు. ఇరాన్ అధ్యక్షుడు ఖుమేదీనిని హత్య చేయడం, వెనిజులా అధ్యక్షుడు మదురోను అపహరించడం, గాజాను మరుభూమిగా మార్చడం వంటివి అమెరికా ఉన్మాదానికి పరాకాష్ట అన్నారు. మానవత్వం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికా చేతులు రక్తంతో తడిసి ఉన్నాయని ఆరోపించారు.
ప్రపంచ నరహంతకులుగా ముద్రపడ్డ దేశాలతో మోదీ ప్రభుత్వం చేతులు కలపడం దేశ పౌర సమాజానికి అవమానకరమని ఆయన అన్నారు. అలీన విధానాన్ని అనుసరించే భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం.. ట్రంప్, నెతన్యాహు వంటి నేతలతో ఒప్పందాలు చేసుకోవడం అన్యాయమన్నారు. వెంటనే భారత్ తన దౌత్య, వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకుని ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం, రాష్ట్ర నాయకులు చంద్ర అరుణ, కల్పన, నాయిని రాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ కృష్ణ, అమర్లపూడి రాము, నూప భాస్కర్, మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు గోపాలరావు, బానోతు ధర్మ, బోసు, బుర్ర వెంకన్న, కల్లూరి కిశోర్, పృథ్వీ, మండల నాయకులు బైరు వెంకన్న, మధు పాల్గొన్నారు.