Gajularamaram | దుండిగల్, మార్చి25: మేడ్చల్ మల్కాజిగిరి జ్లిలా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు పలువురు భూబకాసురులు మాస్టర్ ప్లాన్ వేశారు. కోట్ల రూపాయల విలువ చేసే సర్వే నెంబర్ 79లోని సుమారు వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు యత్నించారు. పక్కనే ఉన్న ప్రైవేటు సర్వే నంబర్లను వేసి దస్తావేజులు తయారుచేయడంతో పాటు ఏకంగా బేస్మెంట్లు కూడా నిర్మించారు.
గతంలో కూడా ఈ భూమిని ఆక్రమించేందుకు పలువురు కబ్జాదారులు ఆ స్థలంలో నిర్మాణాలు మొదలుపెట్టారు. కానీ అది గమనించిన రెవెన్యూ అధికారులు వాటిని అడ్డుకుని కూల్చేశారు. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో మంగళవారం తెల్లారేసరికి బేస్మెంట్లు నిర్మించారు. ఇది చూసిన స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకున్నారు. అయితే ఇది ప్రైవేటు భూమి అంటూ రెవెన్యూ అధికారులనే బురిడీ కొట్టించేందుకు కబ్జాదారులు ప్రయత్నించారు. కానీ అధికారుల ముందు వారి ఆటలేవీ సాగలేదు.
ఆ స్థలంలో సర్వే నిర్వహించేంత వరకు ఎటువంటి పనులు చేపట్టకూడదని నిర్మాణదారులను రెవెన్యూ అధికారులు ఆదేశించారు. అయితే రాజకీయ నేతల ఒత్తిళ్లతో సదరు భూమిని అక్రమార్కులకు ధారాదత్తం చేస్తారా? విలువైన ప్రభుత్వ భూమిని రక్షించి భావితరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారా అనేది చూడాలని స్థానికులు అనుకుంటున్నారు.