Madhavaram Krishna Rao | కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 24 : బూటకపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేతలు, ప్రజలు దూరమవుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాలానగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మధు సహా సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని అన్నారు పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 14 నెలలైనా ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గానికి మొండిచేయి చూపిస్తుందని ఆరోపించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడం లేదని, మహిళలకు రూ.2500, ఆసరా పెన్షన్లు నాలుగువేలకు పెంచడం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీలను ఎప్పుడు నెరవేస్తారని ప్రశ్నించారు.
తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ పార్టీ నేతలే రాజీనామాలు చేస్తూ బీఆర్ఎస్లో చేరుతున్నారని మాధవరం కృష్ణారావు తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని… ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని అన్నారు. పార్టీలో చేరిన నేతలు ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు.