Dundigal | దుండిగల్ : బాచుపల్లిలోని ఓ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఘటనపై అటు కుటుంబీకులు, ఇటు పోలీసులకు సమాచారం అందించకుండా కళాశాల యాజమాన్యం వైద్యశాలకు మృతదేహాన్ని తరలించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబీకులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం తప్పుడు సమాచారం ఇవ్వడంతో ప్రిన్సిపాల్ కళాశాలకు వచ్చి వివరణ ఇవ్వాలని పట్టుబట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్యన తోపులాట చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మేళ్లచెరువు-కిష్టాపురం గ్రామానికి చెందిన బైసు శ్రీనివాసరావు-దేవి దంపతులు ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి బోరబండలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరావు కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. రెండో కూతురు పూజిత (18) నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ (ఎస్సార్ గాయత్రి) కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పూజితకు మొదటి నుంచి పక్కలో మూత్రం పోసుకునే అలవాటు ఉండడంతో ఆమె ఉంటున్న హాస్టల్లోని ఓ గదిలో ప్రత్యేకంగా ఉంచారు. బుధవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కి రాకపోవడంఓత హాస్టల్ ఇన్చార్జి పూజిత ఉంటున్న గదిలోకి వెళ్లి చూసింది. దాంతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. దాంతో ఆమె స్టాఫ్ సహాయంతో కిందకు దింపి. మమత ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పూజిత మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత సమాచారం అందుకున్న కుటుంబీకులు కళాశాలకు చేరుకున్నారు. ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం తమ కూతురు చనిపోయిన విషయాన్ని దాచి తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని.. తమకు తెలియకుండానే మృతదేహాన్ని గాంధీకి తరలించారని మండిపడ్డారు. పూజిత ఆత్మహత్య విషయంలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ నిరూప రెడ్డిని పిలవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు ఆమె కళాశాల వద్దకు తీసుకు వచ్చారు. దీంతో ఒకసారిగా స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుమార్తె ఆత్మహత్యాయత్నం చేయగా వైద్యశాలకు తరలించినట్లు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారని ఆమెపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత క్లూస్ టీం హాస్టల్ గదిలోకి వెళ్లి ఆధారాలు సేకరించారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప పూజిత మృతికి సంబంధించిన వివరాలు తెలుస్తాయని.. అప్పటి వరకు ఏం చెప్పలేమని తెలిపారు. ప్రస్తుతం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.