Hydraa | దుండిగల్, ఫిబ్రవరి 28: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ప్రగతినగర్‌కు సంబంధించిన స్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం నాడు రంగనాథ్ పరిశీలించారు.
స్మశాన వాటిక పక్కనే ఉన్న 304, 305, 306 ల సర్వే నెంబర్లను క్లైమ్ చేస్తూ ప్రైవేట్ వెంచర్ల నిర్వాహకులు పనులు చేస్తున్న నేపథ్యంలో సదరు స్థలాలను సైతం ఆయన పరిశీలించారు. ఆయా స్థలాలకు సంబంధించిన పత్రాలు ఏవైనా ఉంటే వచ్చే మంగళవారం వాటిని హైడ్రా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. తదననంతరం అవి ప్రభుత్వ స్థలాలు అవునా? కాదా? అని జాయింట్ సర్వే నిర్వహించి తేలుస్తామని చెప్పారు. ఒకవేళ అది ప్రభుత్వ స్థలమని తేలితే దాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రగతి నగర్ స్మశాన వాటిక కోసం నిజాంపేట కార్పొరేషన్ కు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి ప్రశాంతి, సిబ్బంది తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు జశ్వంత్, ఆకుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.