Hyderabad | మేడ్చల్, మార్చి 25 : క్రికెట్ బెట్టింగ్‌కు యువకుడు బలి అయ్యాడు. రూ.లక్ష నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన సోమేశ్(29) గౌడవెల్లి పరిధిలో రైల్వే పట్టాల మీద పడుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ 25 ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు. రమణ కుమారుడు సోమేశ్ దేవరయాంజాల్ పరిధిలోని ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన సోమేశ్.. సోమవారం నాడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెట్టింగ్ పెట్టి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. బెట్టింగ్‌లో పోగొట్టిన లక్ష రూపాయల్లో తాను పనిచేస్తున్న సంస్థకు చెందిన డబ్బులు కూడా ఉండటం గమనార్హం. ఇలా సోమేశ్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టడం ఇదే తొలిసారి ఏమీ కాదు. నాలుగేళ్ల క్రితం అక్క పెళ్లి కోసం అప్పు చేసి తీసుకొచ్చిన రూ.3లక్షలను కూడా ఇలాగే బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. అప్పుడు కుటుంబంలో గొడవలు జరిగాయి. గట్టిగా బెదిరిస్తే కొడుకు ఏ అఘాయిత్యానికి పాల్పడకూడదన్న తలంపుతో తల్లిదండ్రులే అప్పులు తీర్చారు. అప్పట్నుంచి బెట్టింగ్‌ల జోలికి వెళ్లకుండా బుద్ధిగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ ఇన్ని రోజుల తర్వాత బెట్టింగ్ పెట్టి రూ.లక్ష పోగొట్టాడు.
ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారో అని సోమేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. డ్యూటీకి టైమ్ అవుతున్నప్పటికీ సోమేశ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి ఫోన్ చేస్తే.. కాసేపు ఆగి ఇంటికి వస్తానని చెప్పాడు. కానీ స్నేహితులకు మాత్రం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వారికి తన లొకేషన్ కూడా షేర్ చేశాడు. అది చూసి స్నేహితులు లొకేషన్ ఆధారంగా గౌడవెల్లికి వెళ్లేలోపే ప్యాసింజర్ రైలు కింద పడి సోమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తుచేపట్టారు.