GHMC | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 25: కూకట్పల్లి, మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు దూకుడును పెంచారు. వార్షిక ఏడాది మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వార్షిక ఏడాది లక్ష్యాన్ని సాధించే దిశగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా రోజువారి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే సర్కిల్ వారీగా మొండి బకాయిదారుల జాబితాలను సిద్ధం చేసిన అధికారులు… రెవెన్యూ డాకేట్ల వారిగా బకాయిదారులను కలుస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. పన్నులు చెల్లించని వారికి జీహెచ్ఎంసీ రెవెన్యూ చట్టం ప్రకారం రెడ్ నోటీసులను జారీ చేస్తున్నారు. ఇంటికి వెళ్లి పనులు చెల్లించాలని కోరడంతోపాటు తరచూ ఫోన్లు చేసి విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ స్పందించని బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తున్నారు.
జంట సర్కిళ్ల టార్గెట్ రూ. 207 కోట్లు
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్ల టార్గెట్ను రూ.207 కోట్లుగా నిర్ధారించగా, ఇప్పటికే రూ. 176 కోట్లు వసూళయ్యాయి. ఇంకా రూ.31 కోట్లు బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్లో ఈ ఏడాది లక్ష్యం రూ.116 కోట్లు కాగా.. ఇప్పటికే రూ.91 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.18 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అలాగే కూకట్పల్లి సర్కిల్ లక్ష్యం రూ.91 కోట్లు కాగా.. ఇప్పటికే రూ.78 కోట్లు వసూలు అయ్యాయి. ఇంకా రూ.13 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
ఆస్తులు సీజ్ అస్త్రం
కూకట్పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలో ఆస్తి పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఇప్పటికే మూసాపేట సర్కిల్లో పదికి పైగా.. కూకట్పల్లి సర్కిల్లో నాలుగు ఆస్తులను జప్తు చేశారు. అలాగే మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేస్తూ… పలువురి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీం పై బకాయిదారులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.