మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు శాతిభద్రతలు కరువయ్యాయి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంత మంది పోలీసులే భక్షకులుగా మారి ఇసుక, భూ సెటిల్మెంట్లలో చేతులు కలుపుతూ అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిబంధనలు సైతం అతిక్రమిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో అమానుషగా దాడి చేసి పసిపాప మృతికి కారణమైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలని సోమవారం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, ఉపేంద్రాచారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజుయాదవ్, నేతలు స్వామియాదవ్, రాజుతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో సభ్య సమాజం తలదించుకునే ఘటనలు చోటు చేసుకుంటున్నా అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని మండ్డిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఏ చిన్న ఘటన జరిగినా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు పట్టుకొని శిక్షిస్తారనే పేరుండేది. ఇతర రాష్ట్ర పోలీస్ అధికారులు మన విధానాలనే అమలు చేసేవారని గుర్తు చేశారు. నేషనల్ క్రైం బ్యూరో రికార్డు ప్రకారం తెలంగాణలో నేరాలు పెరిగాయని లెక్కలు చెపుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని పేర్కొన్నారు. కుమ్మెర దేవాలయంలోకి ప్రవేశించిన బీసీ మహిళపై దాడి చేస్తున్న సమయంలో రెండు నెలల పసికందు ఉందని, తనపై దాడి చేయవద్దని వేడుకుంటున్నా.. గ్రామానికి చెందిన అగ్రకుల నాయకులు కాలుతో తన్నడంతో పాప ఎగిరిపోయి బండరాయిపై పడి మృతి చెందింది. గుడికి సున్నాలు వేశామని వేడుకుంటున్నా కనికరం చూపలేదన్నారు.
గదిలోకి తీసుకెళ్లి శారీరకంగా, మానసికంగా హింసించారని ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీస్‌స్టేషన్ వెళితే ఫిర్యాదు తీసుకోకుండా గ్రామంలో దాడికి పాల్పడిన వారికి ఫోన్ చేసి కౌంటర్ ఫిర్యాదు ఇవ్వాలని, అప్పుడే బాధితులు బయటపడి కేసు వెనక్కి తీసకుంటారని పోలీసు అధికారులు సలహాలు ఇచ్చినట్లు గ్రామ ప్రజలు చెప్పుకుంటున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు మహిళ ఎప్పుడు వచ్చిందో సీసీ కెమెరాలో పరిశీలించాలని, దాడికి పాల్పడిన వారిని ఎందుకు వదిలేశారో విచారణ చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి రూ.కోటి పరిహారం ఇవ్వడంతోపాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హత్యా నేరం, ఎసీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులు చర్యలు చేపట్టాన్నారు. 24 గంటలలో నిందితులను పట్టుకొని వారికి సహకరించిన అధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రాణాలకు తెగించి పో రాటం చేశాం.. తెలంగాణ సాధించుకున్నాం.. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలనే తెలంగాణ తెచ్చాం.. పదేళ్లు మంచి పాలన అందించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండునెలల పసికందు ప్రాణానికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొకుంటే జాతీయస్థాయి ఎస్సీ, ఎస్టీ కమిషనుకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.