MLA Madhavaram Krishna Rao | బాలానగర్, మార్చి 1 : పార్కుల మెయింటెనెన్స్‌లో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గంలో కోట్లాది నిధులు కేటాయించి పార్కులను అభివృద్ధి చేసి, మెయింటెనెన్స్ బాధ్యతలు అందజేశామని తెలిపారు. కానీ ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకుండా ఆయా పార్కులు అధ్వాన్నంగా తయారుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు, పార్కుల నిర్వహణలో లోపం కారణంగా ప్రజలు పార్కులకు రావడం లేదని అన్నారు. కూకట్పల్లి ఐడియల్ చెరువు దగ్గర ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పార్క్.. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధ్వానంగా తయారైందని అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని మలేషియన్ టౌన్షిప్లో ఐదెకరాలు, 15వ ఫేజ్‌లోని చిత్తరమ్మ టెంపుల్ దగ్గర కావ్య స్థలము, 9వ ఫేస్ లోని రెండు ఎకరాల ఖాళీ స్థలాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొని అభివృద్ధి చేసి మెయింటెనెన్స్ చేయాలని సూచించారు. అదేవిధంగా కాముని చెరువును అభివృద్ధి చేసి తీర్చిదిద్దాలని అన్నారు.
పార్కులు, ఆట స్థలాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం వాకింగ్ కోసం వచ్చే స్థానిక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఐదో ఫేజ్‌లోని ట్రయాంగిల్ పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాలుగో ఫేజ్ ఫస్ట్ బస్ స్టాప్ వద్ద గల థీమ్ పార్కును, బస్తీ దవాఖాన ముందు గల పెద్ద పార్కును కూడా పరిశీలించి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పార్కులలో ఎలాంటి నగదు వసూలు చేయకుండా అందరికీ ప్రవేశం కల్పించామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పార్కులోకి వెళ్లాలంటే ఫీజులు వసూలు చేస్తూ డబ్బులు దండుకుంటుందని ఆరోపించారు. నియోజకవర్గంలో అత్యధికంగా 8 చెరువులు ఉన్నాయని తెలిపారు. ఆయా చెరువుల సుందరీకరణ పనులు చేపట్టి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మరికొన్ని చెరువుల సుందరీకరణ పూర్తికాలేదని తెలియజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కోట్లాది నిధులు కేటాయించి అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడంలో కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అత్యధిక నిధులు కేటాయిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవసరమైన నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.