Tollywood | సంక్రాంతి సీజన్లో కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఫిబ్రవరి నెల మాత్రం తీవ్ర నిరాశ మిగిల్చింది. మొత్తం పది సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ, కమర్షియల్‌గా భారీ లాభాలు తెచ్చిపెట్టిన క్లీన్ హిట్ ఒక్కటి కూడా లేకపోవడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. ఈ నెలలో రిలీజైన సినిమాల్లో సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే ఓ మోస్తరు ఫలితాన్ని సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ స్థాయిలో భారీ కలెక్షన్స్ రాలేదు. అయినా పెట్టుబడికి తగ్గ రికవరీ సాధించడంతో కమర్షియల్‌గా “సేఫ్ జోన్”లో నిలిచిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే భారీ అంచనాలతో వచ్చిన గుణశేఖర్ తెరకెక్కించిన యూరోఫియా, అలాగే విశ్వక్ సేన్ ఫంకీ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కంటెంట్ పరంగా బలహీనతలు ఈ సినిమాలకు పెద్ద మైనస్ అయ్యాయి. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్‌కి హే బల్వంత్ నిరాశే మిగిల్చింది. యావరేజ్ టాక్ కూడా రాకపోవడంతో ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ జాబితాలో చేరింది. సరైన కమర్షియల్ సక్సెస్ ఇంకా సుహాస్‌కు అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక మిగతా కొన్ని సినిమాలు ప్రేక్షకులకు రిజిస్టర్ కూడా కాలేదు.. శివ కందుకూరి ‘నవాబ్ కేఫ్’, సాయి సింహాద్రి ‘సన్ ఆఫ్’, అలాగే ‘సీతా పయనం’, ‘విత్ లవ్‘, ‘శ్రీ చిదంబరం గారు’ లాంటి సినిమాలు కనీస బజ్ లేకుండా రిలీజ్ అయ్యి, అంతే సైలెంట్ గా మొదటి వీకెండ్‌కే థియేటర్ల నుంచి సైలెంట్‌గా తప్పుకున్నాయి. నెలాఖరులో ఫిబ్రవరి 27న రిలీజైన వ్రీ విష్ణు విన్యాసం పైనే ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది. శ్రీవిష్ణు మార్క్ కామెడీ వర్కౌట్ అవుతుందని భావించినప్పటికీ, ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ ఓ మోస్తరుగా ఉన్నా, అసలు ఫలితం మాత్రం వీకెండ్ వసూళ్లపైనే ఆధారపడి ఉంది.
అయితే ఏపీ, తెలంగాణ ప్రేక్షకుల పల్స్ పూర్తిగా మారిపోయిందని ఈ నెల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సంక్రాంతి లాంటి పెద్ద సీజన్ తర్వాత వచ్చిన రెగ్యులర్ సినిమాల కోసం థియేటర్లకు రావడంలో ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. “ఓటీటీలో చూసుకుందాం” అన్న మైండ్‌సెట్ బలపడుతోంది. థియేటర్లలో కలెక్షన్స్ తగ్గిపోవడంతో నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో ఎగ్జిబిటర్లు కూడా నష్టాలు చవిచూశారు. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, అలాగే ఏ మాయ చేశావే వంటి రీ-రిలీజ్ చిత్రాలపై ఆధారపడాల్సి వచ్చింది. మొత్తానికి, పది సినిమాలు రిలీజ్ అయినా టాలీవుడ్‌కు ఫిబ్రవరి పూర్తిగా డ్రై మంత్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు ట్రేడ్ వర్గాల చూపు ‘విష్ణు విన్యాసం’ వీకెండ్ పెర్ఫార్మెన్స్పై, అలాగే వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ మార్చి-ఏప్రిల్‌లో రాబోయే భారీ లైనప్‌పైనే ఉంది. సమ్మర్ సీజన్ టాలీవుడ్‌కు ఊపిరి పోస్తుందా? అన్నది చూడాలి.