భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ మరియు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మైథాలాజికల్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. అలాగే రావణాసురుడి పాత్రలో రాకింగ్ స్టార్ యశ్ కనిపించనుండగా, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ విజువల్ వండర్ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోల పర్యవేక్షణలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నప్పటికీ, ఇటీవల విడుదలైన ట్రైలర్లో బయటకు వచ్చిన కొన్ని విజువల్స్ మరియు షాట్లు అసంపూర్తిగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో సీజీఐ (CGI) మరియు లైటింగ్ వర్క్ కృత్రిమంగా, సహజత్వం లేకుండా కనిపిస్తున్నాయని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. సినిమాలోని భావోద్వేగాల కంటే కేవలం విజువల్ గ్రాండియర్పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు కూడా మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇవి సరిపోవన్నట్లుగా చిత్రంలోని కాస్ట్యూమ్స్ డిజైనింగ్‌పై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా సీత పాత్రతో పాటు ఇతర మహిళా పాత్రలు ధరించిన వస్త్రధారణపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండింగ్‌గా మారుతోంది. ఏది ఏమైనా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రియుల దృష్టి ప్రస్తుతం ‘రామాయణ’ సినిమాపైనే కేంద్రీకృతమై ఉంది. ఇలాంటి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం, వస్తున్న విమర్శలను తిప్పికొట్టి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.