Bolywood | భారతీయ సినీ చరిత్రలో విడుదలైన తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఇప్పటివరకు ప్రధానంగా సౌత్ చిత్రాలకే సాధ్యమైంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆ మైలురాయిని అందుకునేలా ‘దురంధర్ 2’ దూసుకొస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజే వంద కోట్ల మార్కును టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం విడుదలైన ‘దురంధర్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 50 రోజులకు పైగా ప్రదర్శితమై వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరడంతో పార్ట్-2పై అంచనాలు అమాంతం పెరిగాయి. అదే ఊపుతో ఇప్పుడు ‘దురంధర్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది.
హిందీ వెర్షనే తొలి రోజే సుమారు రూ.80 కోట్ల గ్రాస్ (దాదాపు రూ.70 కోట్ల నెట్) వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఈసారి చిత్రం పలు భాషల్లో డబ్బింగ్ అవుతూ విడుదల కావడం అదనపు ప్లస్ పాయింట్‌గా మారింది. ఇప్పటివరకు బాలీవుడ్ చిత్రాలకు దక్షిణాది మార్కెట్ నుంచి పెద్దగా వసూళ్లు రాలేదు. అయితే ‘దురంధర్ 2’కు సౌత్‌లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. డబ్బింగ్ వెర్షన్ల ద్వారా వచ్చే వసూళ్లు ఈ సినిమాను మ్యాజికల్ రూ.100 కోట్ల ఓపెనింగ్ వైపు నడిపిస్తాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందీ బెల్ట్‌తో పాటు దక్షిణాది మార్కెట్ సపోర్ట్ అందితే బాలీవుడ్ నుంచి తొలి డే-1 వంద కోట్ల చిత్రంగా ఇది చరిత్ర సృష్టించే అవకాశముంది.
అయితే ఈ ప్రయాణంలో అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తోంది రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’. మార్చి 19న రెండు చిత్రాలు ఒకేసారి విడుదల కానుండటంతో థియేటర్ల పంపిణీ, ప్రేక్షకుల దృష్టి కాస్త మళ్లే అవకాశం ఉంది. ‘టాక్సిక్’ కూడా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనడం ఖాయం. ఇప్పటివరకు సౌత్ నుండి వచ్చిన చాలా చిత్రాలు తొలి రోజే వంద కోట్లకు పైగా వసూలు చేయగా, బాహుబలి 2 భారతీయ చిత్రసీమలో మొదటిసారి ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత సాహో ప్రభాస్ క్రేజ్‌తో భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత సలార్, కల్కి 2898 ఏడీ కూడా తొలి రోజే వంద కోట్ల మార్క్ దాటాయి. రాకింగ్ యష్ నటించిన కేజీఎఫ్: చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సీక్వెల్ పుష్ప2 కూడా ఈ క్లబ్లో చేరింది. ఇక RRR అయితే తొలి రోజే సుమారు రూ.220 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.
బాలీవుడ్ చిత్రాలు ఇప్పటివరకు డే-1 వంద కోట్ల క్లబ్లో చోటు దక్కించుకోలేకపోయాయి. అలాంటి సమయంలో ‘దురంధర్ 2’ ఆ కలను నిజం చేసేలా కనిపిస్తోంది. అయితే ‘టాక్సిక్’తో క్లాష్ నేపథ్యంలో అసలైన ఫలితం మార్చి 19న బాక్సాఫీస్ వద్దే తేలనుంది.