Viral Video : గ్రేటర్ నోయిడా పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఒక థార్ వాహనదారుడు ఒక బైకును పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా బైకును ఈడ్చుకెళ్లడంతో బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, గ్రేటర్ నోయిడాకు చెందిన 22 ఏళ్ల హర్ష్, స్థానిక ధుమ్ మానిక్‌పూర్ ఏరియాలోని ఒక పెట్రోల్ బంకులో శుక్రవారం తన బ్లాక్ మహీంద్రా థార్‌లో డీజిల్ పోయించుకున్నాడు.
అయితే, డీజిల్‌కు బిల్లు చెల్లించకుండా వేగంగా వెళ్లిపోయాడు. వెంటనే కుల్దీప్ శర్మ అనే పెట్రోల్ బంక్ సిబ్బంది ఒకరు బైకుపై అతడిని వెంబడించాడు. అలా జీటీ రోడ్డులోని నేషనల్ హైవే 91పై థార్‌ను అనుసరిస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో ఆ బైకు అదే మహీంద్రా థార్ కింద పడిపోయింది. అయినప్పటికీ ఆ డ్రైవర్ హర్ష్.. థార్‌ను ఆపకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. చుట్టుపక్కల వాళ్లు చూసి ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వాహనం కింద బైకు, రైడర్ ఉన్నాడని డ్రైవర్‌కు చెప్పినా అలాగే థార్ నడిపాడు. దీంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు కూడా చాలా దూరం థార్ వెంటపడ్డారు. చివరకు ఒక టోల్ ప్లాజా వద్ద థార్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
In UP’s Noida, owner of a black Thar fled without paying after refueling at a filling station. When pump employee chased him on a bike, the Thar owner rammed the Thar onto employee’s bike leaving the pump employee critically injured. The Thar dragged the bike for about 10 km. pic.twitter.com/JGFc5iLaoa
— Piyush Rai (@Benarasiyaa) February 28, 2026
అప్పటికే థార్ కింద బైక్ దాదాపు పది కిలోమీటర్లు అలాగే ఉంది. రోడ్డుపై వాహనం రాజుకుంటూ వెళ్లడంతో కొంత మంటలు కూడా చెలరేగాయి. ఈ ఘటనలో బైక్ రైడర్ కుల్దీప్ శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో బైకుతోపాటు థార్ కూడా ధ్వంసమైంది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోగా, థార్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.