Mobile | శామీర్‌పేట, ఫిబ్రవరి 18 : సెల్‌ఫోన్ చోరీ కేసును జీనోమ్ వ్యాలీ పోలీసులు గంటలో చేధించారు. ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిమిషాల్లోనే దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి మొబైల్ రికవరీ చేయడంతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జీనోమ్ వ్యాలీ పోలీసుల కథనం ప్రకారం.. భారత్ బయోటెక్ కంపెనీలో పని చేస్తున్న హరికృష్ణ విధులు ముగించుకుని సోమవారం రాత్రి దాదాపు 10:45 గంటల ప్రాంతంలో తుర్కపల్లి వైపు నడుచుకుంటూ సెల్ ఫోన్ మాట్లాడుకుంటు వస్తున్నాడు. మార్గమధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మోటర్ సైకిల్‌పై వేగంగా వచ్చి సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుడు తుర్కపల్లిలోని జీనోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి భారత్ బయోటెక్ నుంచి తుర్కపల్లి వైపు రోడ్డులో సీసీ కెమెరాల చెక్ చేసి గంట వ్యవధిలో కేసును చేధించారు. సెల్ ఫోన్ చోరికి పాల్పడిన దొంగలను తుర్కపల్లికి చెందిన చీర్ల ఠాగూర్, చీర్ల శ్రీశైలంగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. చోరీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేధనలో చురుగ్గా పని చేసిన సిబ్బంది జంగయ్య, చందు, యాదగిరి, లక్ష్మణ్‌లను డీసీపీ, ఏసీపీలు అభినందించినట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.