Dundigal | దుండిగల్, ఆగస్టు 20 : బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్త తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తలేడనే కోపంతోపాటు ఆర్థిక ఇబ్బందులు, అధిక సంతానం కారణంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటిసంపులో తోసి తాను, దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే సంపులో మూడుఫీట్ల వరకు మాత్రమే నీరు ఉండటంతో నీటమునిగిన ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక దుర్మరణం చెందగా.. ఆత్మహత్యకు యత్నించిన మహిళ గాంధీ వైద్యశాలలో చికిత్స పొందుతుంది.
సీఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం, ధర్మారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తితో సంగారెడ్డి జిల్లా కంగై మండలంలోని తురకవాడగమ్మ గ్రామానికి చెందిన రత్నతో 11 ఏండ్ల క్రితం (2014లో) వివాహమైంది. వీరికి 4 కొడుకులు అజయ్ (3), పవన్ (7), అరుణ్ (3)లతోపాటు ఎనమిది నెలల వయస్సున్న సుభాష్ అనే కొడుకు ఉన్నారు. దంపతులు తమ పెద్దకొడుకులు ఇద్దరు ఆజయ్, పవన్‌లను తమ సొంతూరు ధర్మారంలోని లక్ష్మన్ తల్లిదండ్రుల వద్దనే ఉంచారు. రేండేండ్ల క్రితం మూడో కొడుకు అరుణ్‌తో కలిసి ఉపాధికోసం నగరానికి వలసవచ్చి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో ఓ రేకుల గదిని కిరాయికి తీసుకుని నివాసముంటున్నారు.
8 నెలల క్రితం మరో కొడుకు..
వీరికి ఎనిమిది నెలల క్రితం మరో కొడుకు సుభాష్ జన్మించాడు. భర్త లక్ష్మన్ ఇటుకలారీపై కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే లక్ష్మణ్‌కు కూతురును కనాలనే కోరిక ఉండగా ఇప్పటికే ఎక్కువ సంతానం కలుగడంతో తనకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించాలని లక్ష్మి భర్తతో గొడవపడుతుంది. దీనికి తోడు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో దంపతుల మధ్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సైతం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
అనంతరం రాత్రి లక్ష్మణ్ ఇటుకలోడును అన్లోడ్ చేసేందుకు లారీపై పటాన్ చెరువుకు వెళ్లాడు. భర్త తన మాట వినడం లేదని తీవ్ర మానసిక ఆందోళనకు గురైన రత్న అర్ధరాత్రి 1-2 గంటల సమయంలో తన ఇద్దరు కొడుకులను ఇంటిముందున్న నీటి సంపులోకి తోసింది. అనంతరం తాను అందులో దూకింది. అయితే సంపులో 3 ఫీట్లవరకు మాత్రమే నీరు ఉండటంతో చిన్నారులు నీటమునిగి దుర్మరణం చెందగా, ఆయాసంతో నీటిలో కొట్టుకుంటున్న రత్నను పక్కగదిలో నివాసముంటున్న వారు గమనించి బయటకు తీశారు.
అనంతరం పోలీసులకు, భర్తకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం కోసం చిన్నారులు ఆరుణ్, సుభాష్ మృతదేహాలను గాంధీ వైద్యశాలకు తరలించారు. లక్ష్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రత్న ప్రస్తుతం గాంధీవైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఆమె ప్రాణాలకు ఎటువంటి ఆపాయం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.
Constitution Amendment Bill: పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు : విపక్షాల ఆరోపణ
Rajapeta : రాజాపేట చెరువుల్లోకి చుక్కనీరు రాలే
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని రైతుల ధర్నా