న్యూఢిల్లీ: లోక్‌సభలో ఇవాళ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుల(Constitution Amendment Bill)ను విపక్షాలు వ్యతిరేకించాయి. దేశాన్ని బీజేపీ పోలీస్ రాజ్యంగా మారుస్తున్నదని విపక్ష నేతలు ఆరోపించారు. సీనియర్ కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ఇది క్రూరమైన చట్టమని పేర్కొన్నారు. అవినీతి వ్యతిరేక చర్య అని చెబుతూనే తీవ్రమైన చట్టాన్ని రూపొందించినట్లు ఆమె ఆరోపించారు. సీఎంపై ఏదైనా కేసును పెట్టి, అతన్ని 30 రోజుల పాటు అరెస్టు చేసి, సీఎం పదవి నుంచి అతన్ని తొలగిస్తారని ఆమె ఆరోపించారు. రాజ్యాంగ సవరణ బిల్లు .. రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. అప్రజాస్వామికమైందన్నారు. బిల్లును ప్రవేశపెట్టడం దురదృష్టకరమని ప్రియాంకా తెలిపారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేశాన్ని ఓ పోలీస్ స్టేట్‌గా బీజేపీ మారుస్తోందన్నారు. బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ప్రధానమంత్రిని ఎవరు అరెస్టు చేస్తారని, ఈ బిల్లులతో దేశాన్ని పోలీసు రాజ్యంగా బీజేపీ మారుస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఆ బిల్లులను వ్యతిరేకిస్తామని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని బీజేపీ విస్మరిస్తోందని ఓవైసీ అన్నారు.
ఒకవేళ పీఎం, సీఎం, మంత్రులు ఎవరైనా అరెస్టు అయి 30 రోజులు జైలులో ఉంటే వాళ్ల పదవి ఊడే బిల్లును ఇవాళ లోక్‌సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఆందోళన చేశాయి. ఓ దశలో మంత్రి అమిత్ షాపై.. విపక్ష నేతలు బిల్లు పేపర్లను చింపి విసిరేశారు.