పన్నెండేళ్ల క్రితం ‘ఊహలు గుసగుసలాడే’ అనే హిట్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఢిల్లీ భామ రాశీఖన్నా. ఆ తర్వాత ఎన్టీఆర్, రవితేజ, ధనుష్ వంటి స్టార్లతో సినిమాలు చేసినా, అనుకున్నంత స్టార్డమ్ మాత్రం రాశీఖన్నాను వరించలేదు. నిజానికి అందంలోనూ, అభినయ సామర్థ్యంలోనూ నేటి స్టార్ హీరోయిన్లెవరికీ తీసిపోదు రాశీఖన్నా. కానీ ఇండస్ట్రీలో ఎదగాలంటే గుమ్మడికాయంత విద్వత్తుంటే చాలదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం కోసం దశాబ్దానికి పైగా ఎదురుచూస్తూనే ఉంది ఈ అందాలభామ.
ఈ నెల 19న రానున్న పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తన కెరీర్‌కి గేమ్‌ఛేంజర్ అని ఆమె గట్టిగా నమ్ముతోంది. ఇదిలావుంటే, ఈ క్రేజీ సినిమా తర్వాత, వెంటనే మరో పానిండియా సినిమాలో రాశీఖన్నా భాగం కానున్నట్టు తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీలో కీలక పాత్ర కోసం రాశీఖన్నాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ సంప్రదించారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. ఇదే నిజమైతే రాశీఖన్నా టైమ్ నిజంగా మొదలైనట్టే.