సృష్టిలో తొలి గురువు అమ్మ . పొత్తిళ్లలో బిడ్డకు అమ్మ చెప్పే కథలే జ్ఞానబోధలు. ఎదుగుతూ.. అమ్మని చదువుతూ.. మంచీచెడూ నేర్చుకుంటాం. సమస్త కళలూ అమ్మ పాలధార నుంచే ఉత్పన్నమవుతాయనేది ఆర్యోక్తి. నటి సాయిపల్లవి కూడా ఇదే విషయాన్ని అద్భుతంగా తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘అమ్మ చేయి పట్టుకొని నడకే కాదు, నాట్యం కూడా నేర్చుకున్నాను. ఈరోజు మీరు చూస్తున్న సాయిపల్లవి అమ్మ చెక్కిన శిల్పం. మా అమ్మ పేరు రాధామణి. అద్భుతమైన నాట్యకళాకారిణి. నాట్యంలోని మెళకువలన్నీ అమ్మను చూసే నేర్చుకున్నాను.
మా అమ్మ నాకు ప్రత్యేకంగా నేర్పింది కూడా ఏమీ లేదు. చూస్తూవుంటే, అలా వచ్చేసింది అంతే. ఒకరకంగా నాట్యం నాకు వారసత్వం ఇచ్చిన వరం. నా నాట్యం వెనుక ఉండే ఎమోషన్ మా అమ్మ. నా కళ్లలో పలికే భావాలు, పరిణతితో కూడిన నాట్య ముద్రలు, భంగిమలు ఇవన్నీ అమ్మను చూస్తూ నేర్చుకున్నవే. నేను వెస్ట్రన్ వేసినా, ఫోక్ డ్యాన్స్ చేసినా అందులో తెలియని క్లాసిక్ టచ్ ఉంటుంది. దానికి కారణం కూడా మా అమ్మే. నన్ను డాక్టర్ చదివించినా, నాలోని డ్యాన్సర్ని మాత్రం అమ్మ నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంది. అమ్మ అభిరుచిని గుర్తించే నేను నటిని అయ్యాను. అమ్మ సాధించలేనిది సాధించి, ఆ విజయాన్ని అమ్మకు కానుకగా ఇచ్చాను’ అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది సాయిపల్లవి.