హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 5 (నమస్తే తెలంగాణ): హైడ్రాలో నకిలీపత్రాల వ్యవహారం కలకలం రేపుతున్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరుతో జరిగిన ఓ బిగ్స్కామ్ బుధవారం వెలుగుచూసింది. ఆయ న సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు సృష్టించిన వైనం సంచలనంగా మారింది. ఇప్పటివరకు సుమారు 52 కళాశాలలు సమర్పించిన ఎన్వోఈలు నకిలీలేనని పోలీసులు తేల్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నగరంలోని కొన్ని ప్రైవేట్ కళాశాలలు నకిలీ ఫైర్ ఎన్వోసీలు సృష్టించినట్టు హైడ్రా అదనపు కమిషనర్ వర్ల పాపయ్య గత నెల 4వ తేదీన నగరంలోని లేక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 ప్రైవేట్ కళాశాలలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కమిషనర్ రంగనాథ్ సహా పలువురు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటర్‌బోర్డుకు ఫైర్ ఎన్వోసీలు సమర్పించినట్టుగా హైడ్రా తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ ఎనిమిది కాలేజీలతోపాటు మరికొన్ని కూడా నకిలీ ఎన్వోసీలు సమర్పించినట్టుగా తమ విచారణలో తేలిందని హైడ్రా ఒక ప్రకటనలో పేర్కొన్నది. తెలంగాణ కోర్ రీజియన్ పరిధిలో 142 జూనియర్ కళాశాలలు ఫైర్ ఎన్వోసీలు సమర్పించాయి.
అందులో 90 వరకు అసలువేనని, మిగతా 52 ధ్రువపత్రాలు నకిలీవని హైడ్రా తెలిపింది. హైడ్రా కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కమిషనర్ పేరిట దొంగ సంతకాలతో ఫేక్ ఎన్వోసీలు సృష్టించారంటూ వచ్చిన అభియోగాలపై బీఎన్ఎస్ సెక్షన్లు 337,336(3), 340(2), 318(4), రెడ్ విత్ 3(5)కింద కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. కాగా తమ ప్రాథమిక దర్యాప్తులో తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్సార్ నగర్, మెహిదీపట్నం, బర్కత్‌పుర ప్రాంతాల్లో ఉన్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఈ ఫోర్జరీ వ్యవహారంలో భాగస్వాములైనట్టు పోలీసులు తెలిపారు. నకిలీలుగా ఫిర్యాదులో పేర్కొన్న వాటిలో చాంద్రాయణగుట్టకు చెందిన శ్రీచైతన్య, ఎస్సార్ నగర్‌కు చెందిన రెసోనెన్స్, బర్కత్‌పురలోని హైందవి, మెహిదీపట్నంలోని ప్రియం, చిక్కడపల్లిలోని న్యూఎరా, విద్యానగర్‌లోని మదర్స్గర్ల్స్, శివరాంపల్లిలోని షాహీన్, తెల్లాపూర్‌లోని వశిష్ట జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
52 కాలేజీల సర్టిఫికెట్లు ఫేక్!
ఇంటర్‌బోర్డు నుంచి అఫిలియేషన్ సాధించడం కోసం సదరు ప్రైవేట్ కళాశాలలు ఈ నకిలీ పత్రాలు సమర్పించాయి. ఇంటర్మీడియట్ విద్యామండలికి ఆయా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్వోసీ సర్టిఫికెట్లను పరిశీలన కోసం హైడ్రాకు పంపించారు. ఆ సర్టిఫికెట్లు సరైనవా? కాదా? అని తేల్చాలని బోర్డు కోరింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల విద్యాధికారులు మొదటి దశలో 76 ఫైర్ ఎన్వోసీలను హైడ్రాకు పంపగా, ఆ పత్రాల పరిశీలనలో 7 ఫేక్ అని హైడ్రా తేల్చింది. ఆ తర్వాత మరో 66 సర్టిఫికెట్లను హైడ్రాకు ఇంటర్ బోర్డు పంపిస్తే వాటిలో 45 నకిలీవని తేల్చిచెప్పింది. నిబంధనల ప్రకారం 21 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సహా అన్ని వాణిజ్య భవనాలు కార్యకలాపాలు ప్రారంభించే ముందు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లుబాటయ్యే విధంగా ఎన్వోసీని తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన ఉన్నది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీలోని ఫైర్ విభాగం హైదరాబాద్‌లో ఎన్వోసీలు ఇచ్చేది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఫైర్ విభాగం హైడ్రాలో విలీనం అయినప్పటి నుంచి వారే గత రెండేండ్లుగా ఎన్వోసీ జారీ చేస్తున్నట్టు అదనపు సంచాలకుడు పాపయ్య తెలిపారు. ఫైర్ ఎన్వోసీ మాత్రం అది కూడా 15 మీటర్ల లోపు ఉన్న భవనాలకు మాత్రమే హైడ్రా ఇస్తుందని, అంతకంటే ఎక్కువ ఉంటే ఫైర్ డీజీ నుంచి తీసుకోవాలని వర్ల పాపయ్య పేర్కొన్నారు.
హైడ్రా ఎన్వోసీ జాబితా రహస్యం!
హైడ్రా నుంచి పలు కళాశాలలకు ఫైర్ ఎన్వోసీ ఇచ్చారనేది చెప్పకుండా ఇంటర్‌బోర్డు పంపిన సర్టిఫికెట్లనే పరిశీలించడంతో పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. తాము ఎన్వోసీ ఇచ్చిన కళాశాలలకు సంబంధించిన వివరాలను మాత్రం హైడ్రా ఇంతవరకు ప్రకటించకపోవడం గమనార్హం. ఒకవేళ తమ వద్ద ఉన్న జాబితాను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పిస్తే నకిలీలను తేల్చడం చాలా సులువుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇందులో హైడ్రా ఎందుకు ఈ ఎన్వోసీ జాబితాను రహస్యంగా ఉంచుతున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక్కో ఎన్వోసీ ఖరీదు రూ.6 లక్షలా!
హైడ్రాకు ఏడాదికాలంగా ఎన్వోసీలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నట్టు హైడ్రాలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఎన్వోసీల విషయంలో ప్రతి ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాము ఎలాంటి ఎన్వోసీలు ఇవ్వడం లేదని చెప్పడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ హైడ్రా నుంచే 15 మీటర్ల ఎత్తువరకు ఉన్న భవనాలకు ఫైర్ ఎన్వోసీలు ఇచ్చే అవకాశం ఉండటంతో అసలు కథ అక్కడే మొదలైందనే చర్చ జరుగుతున్నది. కొందరు మధ్యవర్తులు తమకున్న పరిచయాలతో హైడ్రాలో కొంతమందితో కలిసి ఫైర్ ఎన్వోసీలను కాలేజీలకు, మరికొన్ని అపార్ట్మెంట్లు, బిల్డింగులకు రూ.6 లక్షలకు ఒకటి చొప్పున ఇప్పించినట్టు సమాచారం. ఈ విషయంలో కళాశాలలు కొన్ని తాము నిర్వహిస్తున్న భవనాలకు ఫైర్ ఎన్వోసీకి కావాల్సిన అర్హతలు లేకపోవడంతో అడిగినంత డబ్బులు ఇచ్చి ఎన్వోసీలు తీసుకొన్నారని, ఇవి నకిలీవా? అసలువా? అనేది వారికి తెలియకుండానే జరిగిందని ఓ కళాశాల యజమాని చెప్పారు.
ఇంటి దొంగల పనేనా?
నకిలీ ఎన్వోసీల విషయంలో హైడ్రా అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. నిరుడు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.6 లక్షలు తీసుకోగా, ఈసారి కొంతమేరకు తగ్గించి రూ.2 లక్షలు తీసుకొన్నారని చెప్పుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ నుంచి ఫైర్ విభాగం హైడ్రాలో విలీనమైన కొత్తలో ఎన్వోసీలు రావాలంటే చాలా కష్టమైంది. దీంతో తమకు సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో వాటికోసం ఎన్ని డబ్బులు పెట్టడానికైనా సిద్ధమంటూ పలువురు కళాశాలల యాజమాన్యాలు అప్పట్లో హైడ్రాలో పనిచేసిన కొందరు సిబ్బందిని సంప్రదించడంతో ఈ దందాకు తెరలేచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలోనే ఒకరిద్దరు అధికారులు, సిబ్బందిని కూడా హైడ్రా కమిషనర్ పక్కనబెట్టి వేరే శాఖకు పంపించినట్టు చర్చ జరుగుతున్నది. ఆరు నెలల క్రితమే హైడ్రాకు ఈ నకిలీ ఎన్వోసీలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ.. హైడ్రా అంతర్గతంగా ఆయా అధికారులను పక్కనబెట్టిందే తప్ప.. వీటిని అరికట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో హైడ్రాలో ఒక కీలక అధికారి సహకారంతో ఈ నకిలీలు ఆచితూచి ఇచ్చారని, ఇందులో ఒక్క కళాశాలలకే కాకుండా కొన్ని భవనాలు, అపార్ట్మెంట్లకు కూడా ఇచ్చినట్టు హైడ్రాలోనే చర్చ జరుగుతున్నది.