బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనా రనౌత్‌కు బయోపిక్‌లు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆమె ‘తలైవి’ ‘మణికర్ణిక’ వంటి జీవిత కథా చిత్రాల్లో నటించింది. తాజా సమాచారం ప్రకారం ఆమె మరో బయోపిక్‌లో భాగం కాబోతున్నట్లు తెలిసింది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌కు అనుబంధంగా రాణీ ఆఫ్ ఝాన్సీ మహిళా రెజిమెంట్ ఉండేది. ఇందులో కీలక సభ్యురాలిగా నీరా ఆర్య అనే మహిళ వ్యవహరించింది. భారతదేశానికి సంబంధించిన తొలి మహిళా గూఢచారిగా ఆమెకు పేరుంది.
నేతాజీతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆమెకు సంబంధించిన చారిత్రక వ్యాఖ్యానాలు అనేకం ఉన్నాయి. బ్రిటీష్ అధికారిని పెళ్లాడి, సిద్ధాంత విభేదాలతో విడిపోయిన నీరా ఆర్య అనంతర కాలంలో జైలు జీవితాన్ని గడిపింది. 1998లో నీరా ఆర్య మరణించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆమె చూపించిన ధైర్యసాహసాలు, గూఢచారిగా పనిచేసిన వైనం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని చెబుతారు. ప్రస్తుతం నీరాఆర్య బయోపిక్ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉందని, కంగనారనౌత్ ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తిగా ఉందని బాలీవుడ్ టాక్. ముంబయి దాడుల నేపథ్యంలో జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో రూపొందిస్తున్న ‘భారత్ భాగ్య విధాత’ అనే చిత్రంలో ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తున్నది.