రాజాపేట, ఆగస్టు 20: గత పది రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో చెరువులు అలుగులు పోస్తూ, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కానీ రాజాపేట మండల వ్యాప్తంగా మోతాదు వర్షపాతం నమోదు కావడంతో చెరువుల్లో ఇప్పటివరకు చుక్క నీరు వచ్చి చేరలేదు. రాజాపేట మండలంలో 10 చెరువులు, 36 కుంటలు ఉన్నాయి. రాజాపేట, సింగారం, జాల, కురారం, పాముకుంట, మల్లెగూడెం, నేమిల, దూదివెంకటాపురం, బొందుగుల, చల్లూరు, సోమారం చెరువుల్లో చుక్కనీరు వచ్చి చేరకపోవడంతో చెరువు ఆయకట్టు వరి సాగుకు నోచుకోలేదు. చెరువులు నిండితే వరి సాగు చేద్దామనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఎలాంటి జల వనరులు లేని ఈ ప్రాంతంపై వరుణుడు కరుణ చూపాలని రైతులు వేడుకుంటున్నారు.