జనగామ రూరల్, ఆగస్టు 19: కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గం నీళ్లు లేక, పంటలు సక్రమంగా పండగ ఉన్న పంటలు కాపాడుకోవడం కోసం కాలువలో ఉన్న గోదావరి జలాలు(Godavari )విడుదల చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పలువురు రైతులు ఆరోపించారు. బుధవారం జనగామ మండలం వడ్లకొండ గ్రామ సమీపంలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని గోదావరి జలాలు విడుదల చేయాలని రైతులు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జనగామ- హుస్నాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపాడు, పెదరామచర్ల, ఓబుల్ కేశవపూర్, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువులు, కుంటల్లో గోదావరి జలాలు విడుదల చేసి ఇక్కడి బోరుబావులు ఎండిపోకుండా ఉండటానికి అధికారులు కృషి చేయాలన్నారు. వర్షాకాలంలోనే పొలాలు బీడుగా ఉన్నాయని గోదావరి జలాలు విడుదల చేస్తే కొద్దిగా గొప్ప పంటలు వేసుకోవడానికి వీలుంటుంది అన్నారు. కరువు ప్రాంతమైన జనగామ పై ప్రభుత్వం పట్టించుకొని గోదావరి కాలువలకు నీటిని విడుదల చేయాలన్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల బాధను పట్టించుకుని కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని వేడుకున్నారు. ధర్నా నిర్వహిస్తున్న రైతులను పోలీసులు సర్దిచెప్పి ధర్నాను విరివింప చేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు కలిసి నీటిని విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.