Dulapally | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 18: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి రోడ్డును త్వరితగతిన విస్తరించి, ప్రమాదాలను నివారించేలా తగు చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ జెమ్మి దేవేందర్ కోరారు. ఈ మేరకుకొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డికి మంగళవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జెమ్మి దేవేందర్ మాట్లాడుతూ.. దూలపల్లి టీ జంక్షన్ నుంచి విలేజ్కు వెళ్లే మార్గం రెండువైపులా రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని తెలిపారు. దీని కారణంగా ఉదయం, రాత్రి సమయంలో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. స్థానికులు రోడ్డు దాటాలంటే ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్లానింగ్ ప్రకారం రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల మేరా విస్తరణ పనులు జరగాలని, పూర్తిస్థాయిలో పాత గోడలు ఇతర నిర్మాణాలు తొలగించాల్సి ఉందని చెప్పారు.
ఇప్పటికే తొలగించిన ప్రాంతాల్లో కొంతమంది రేకుల షెడ్లు ఇతర వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకునేందుకు కోరుకుంటున్నారని దీని కారణంగా విస్తరణ పనులు ఏ మేరకు సాధ్యపడుతుందని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వచ్చి చేపడుతున్న నిర్మాణాలను, పురాతన నిర్మాణాలను త్వరితగతిన తొలగిస్తే ప్రయాణికులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ సర్పంచ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ కృష్ణారెడ్డి.. త్వరలోనే టౌన్ ప్లానింగ్ అధికార యంత్రంతో కలిసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.